కాకినాడ క్రైం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాల, పెద్దాపురం మహారాణి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. డ్రోన్ కెమేరాల నిఘాతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ అనంతరం బాణసంచా కాల్చడం సహా విజయోత్సవాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవన్నారు. సెక్షన్ 30 అమలులో ఉంటుందని, గుంపులుగా సంచరించడం, సభలు, సమావేశాలు నిర్వహించడం నేరమని అన్నారు.
నేడు పెద్దాపురంలో
ట్రాఫిక్ ఆంక్షలు
పెద్దాపురం: స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పెద్దాపురం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పెద్దాపురం పట్టణంలోని మహారాణి కళాశాల ఆవరణలో పెద్దాపురం డివిజన్ సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయన్నారు. పెద్దాపురం గుర్రాల సెంటర్ నుంచి సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు టిప్పర్లు, లారీలు, భారీ వాహనాల రాకపోకలు నిషేధించామన్నారు. జగ్గంపేట నుంచి వచ్చే వాహనాలు గుర్రాల సెంటర్ నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కాకినాడ వైపు వచ్చే టిప్పర్లు, లారీలు, భారీ వాహనాలు సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాలన్నారు.
హుండీల ఆదాయం లెక్కింపు
పిఠాపురం: స్థానిక పాదగయ శ్రీరాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల ఆదాయం లెక్కింపును గురువారం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కేఎల్ సుధారాణి, కార్యనిర్వహణాధికారులు బీవీఆర్ చౌదరి, ఎం.వీరభద్రరావు పర్యవేక్షణలో చీఫ్ ఫెస్టివల్ అధికారి చాగంటి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు చేపట్టారు. 80 రోజులకు హుండీల ద్వారా రూ.26,76,188 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. 2026 ఆగస్టు 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 80 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.26,76,188 ఆదాయం లభించినట్లు వెల్లడించారు.


