భక్తులు సంతృప్తి చెందేలా సేవలు | - | Sakshi
Sakshi News home page

భక్తులు సంతృప్తి చెందేలా సేవలు

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

● దేవదాయ శాఖ కమిషనర్‌

రామచంద్రమోహన్‌

● అన్నవరంలో కార్తికమాస

ఏర్పాట్లపై దిశానిర్దేశం

అన్నవరం: స్థానిక సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి కార్తిక మాసంలో వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా సిబ్బంది సేవలందించాలని దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశించారు. దేవస్థానంలో కార్తికమాసం ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో వైదిక సిబ్బంది, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వివిధ విభాగాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో దేవస్థానంలో ఈఓగా పనిచేశారని, ప్రస్తుతం కార్తిక మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అఽధికారులను ఆదేశించారు. దేవస్థానంలో ఎక్కడ ఏ సమస్య కనిపించినా అది వేరే విభాగం వారిదని వదిలేయవద్దని, ఆ విభాగానికి సమాచారం ఇవ్వాలని కమిషనర్‌ ఆదేశించారు. గతంలో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రత్యేక అధికారుల నియామకం

కార్తికమాసంలో ఇబ్బంది రాకుండా ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. దేవస్థానంలోనే వారు ఉండి ఈఓతో పాటు ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని అన్నారు. మధ్యాహ్నం సిబ్బందితో జరిగిన సమావేశంలో కమిషనర్‌ పలు ఆదేశాలిచ్చారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాల్లో తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఇతర రోజుల్లో తెల్లవారు జామున మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, భక్తులకు దర్శనం ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులను నియంత్రించడంలో రోప్‌ పార్టీలను ఉపయోగించాలని అన్నారు. నవంబర్‌ 21న సత్యదేవుని తెప్పోత్సవం నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 24న కార్తిక పౌర్ణిమ నాడు జరిగే సత్యదేవుని గిరిప్రదక్షిణకు లక్షకు పైగా భక్తులు వస్తారని అన్నారు. అందువల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రత్నగిరిపై, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కొండదిగువన ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణలో ముఖ్యమైన సిబ్బంది పాల్గొని రద్దీని నియంత్రించాలని అన్నారు. ఈ విషయంలో పోలీసుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ ఏర్పాట్ల విషయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, డిప్యూటీ కమిషనర్‌ బాబూరావు, ఏసీ మంజులాదేవి, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement