పంచాయతీ పోరుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరుకు సన్నద్ధం

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

● మూడు విడతల్లో ఎన్నికలు

● జిల్లాలో 385 చోట్ల నిర్వహణ

● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటికి విడతల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదల, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వంటి కార్యక్రమాలకు విడతల వారీగా షెడ్యూల్‌ ఖరారు చేశారు.

మొదటి విడతలో..

జిల్లాలో తొలి విడత ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్లకు ఉపసంహరణకు ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటల వరకూ గడువు ఇస్తారు. ఈ నెల 26న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాకినాడ రూరల్‌, కరప, తాళ్లరేవు, పెదపూడి, సామర్లకోట, కాజులూరు మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల సామగ్రి, ఇతర ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

రెండో విడతలో..

రెండో విడత ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు గడువు ఉంటుంది. 29న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, జగ్గంపేట, తొండంగి, పెద్దాపురం, గండేపల్లి తదితర మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

మూడో విడత డిసెంబర్‌ 2న..

మూడో విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 19న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నవంబర్‌ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. డిసెంబర్‌ 2న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement