సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 191 వార్డులు ఉండగా.. 4 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 187 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏలేశ్వరం, పిఠాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, తుని, పెద్దాపురం పురపాలక సంఘాల్లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) ప్రక్రియను శనివారం పూర్తి చేశారు. ఆయా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని ఇప్పటికే తరలించారు.
వార్డుకు తెలుపు..
చైర్‌పర్సన్ గులాబీ
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. అప్పటి వరకు క్యూలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఏవైనా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 2వ తేదీన చేపడతారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 3వ తేదీ 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నికల నిర్వహణకు 740 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. వార్డు మెంబర్ ఎన్నికకు తెలుపు రంగు, చైర్‌పర్సన్ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు.
321 పోలింగ్ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా ఆరు పురపాలక సంఘాల పరిధిలో 191 వార్డులున్నాయి. 187 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి గాను 321 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం ఓటర్లు 2,18,054 ఉండగా.. పురుషులు 1,04,756 మంది, మహిళలు 1,13,269 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన కేంద్రాలకు ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు, క్రిటికల్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు సమయంలో పూర్తిస్థాయి వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన పోలీసు బందోబస్తుతో పాటు జోనల్, రూట్ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 321 మంది పీఓలు, 321 మంది ఏపీఓలు, 1,005 మంది ఇతర పీఓలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.
ఫ పట్టణాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
ఫ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు,
191 వార్డులు
ఫ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్


