వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని, రాప్తాడులో తరగతి గదిలోనే విద్యార్థినిపై పాశవిక దాడి దారుణమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే దాడి చేయడం దారుణమన్నారు. తోటి విద్యార్థినుల కళ్ల ముందే ఇంతటి ఘోరమైన ఘటన జరగడంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. టీచర్ సహా విద్యార్థులు షాక్ గురయ్యేలా జరిగిన ఈ సంఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, సంఘటనకు బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు.
జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంట నష్టం
కొత్తపల్లి: జిల్లాలో సుమారు 85 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారని, అర్నబ్ తుపాను కారణంగా దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు జాయింట్ డైరెక్టర్ (జేడీ) వీటీ రామారావు తెలిపారు. తుపాను ప్రభావంతో సుబ్బంపేట పరిసర ప్రాంతాల్లో సముద్రపు ఉప్పునీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చి దెబ్బతిన్న పంట పొలాలను శనివారం వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఏడీఏ పి.స్వాతి, మండల వ్యవసాయ అధికారి వి.జోగిరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కోతకు సిద్ధంగా ఉన్న పంటల్లో సుమారు 60 శాతం వరకు ఈదురు గాలులకు నష్టం వాటిల్లిందన్నారు.
నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరుగన్ను ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ర్యాంపులు, తాగునీరు, షామియానాలు తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆధార్ కార్డు, ఫొటో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన సుమారు 20 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాని ఉపయోగించి ఓటు వేయవచ్చని తెలిపారు.
పోలీస్ అమరవీరులను స్మరిస్తూ..
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్‌పీ) బెటాలియన్ ఆవరణలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజున అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ బెటాలియన్ మొదటి గేటు నుంచి స్మృతివనం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దీనికి బెటాలియన్ కమాండెంట్ కె.నవీన్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు డి.మురళీకుమార్, డీడీ గంగరాజు, ఎస్.మన్మథరావు, చంద్రశేఖర్, మోహన్‌రావు, మురళీమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


