సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతూండగా చైర్‌పర్సన్ స్థానాలకు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా 52 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 20 మంది ఉపసంహరించుకోవడంతో చైర్‌పర్సన్ల బరిలో చివరకు 32 మంది పోటీలో మిగిలారు. గొల్లప్రోలు చైర్మన్ స్థానానికి 4, పిఠాపురం 5, తుని 7, ఏలేశ్వరం 5, పెద్దాపురం 7, సామర్లకోటలో నలుగురు బరిలో ఉన్నారు. మొత్తం ఈ ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 191 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 905 మంది నామినేషన్లు వేయగా, ఏకంగా 430 మంది ఉపసంహరించుకున్నారు. వివిధ కారణాలతో 6 నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో 469 మంది పోటీలో మిగిలారు. అత్యధికంగా పిఠాపురం నుంచి 108 బరిలోకి దిగనుండగా.. సామర్లకోట నుంచి 88 మంది, తుని 88, గొల్లప్రోలు 55, ఏలేశ్వరం 61, పెద్దాపురం 69 మంది పోటీలో ఉన్నారు. వీరందరూ గురువారం నుంచి ఇంటింటి ప్రచారానికి అన్ని అస్త్రాలూ సిద్ధం చేసుకుంటున్నారు.
పంచారామ క్షేత్రంలో
తెలంగాణ హైకోర్టు జడ్జి
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలా త్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.ప్రవీణ్ కుమార్ దంపతులు బుధవారం సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ప్రవీణ్ కుమార్ దంపతులకు పండితులు ఆశీర్వచనాలు, స్వామి వారి ఫొటో, ప్రసాదాన్ని ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు అందజేశారు.
‘స్థానిక’ అరాచకాలపై ‘సుప్రీం’
స్పందన శుభపరిణామం
కాకినాడ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అరాచకాలపై సుప్రీంకోర్టు స్పందించడం శుభ పరిణామమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా ‘పచ్చ’మూకలు చేసిన అరాచకాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టినా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో ఈ నెల 25వ తేదీ వరకూ అభ్యర్థుల తుది జాబితా వెల్లడించకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించి, ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలుకు 48 గంటల అదనపు సమయం కేటాయించడం హర్షణీయమన్నారు. అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని నాగమణి డిమాండ్ చేశారు.
రత్నగిరికి.. వేలాదిగా..
అన్నవరం: దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వారు, ఇతర భక్తులు వేలాదిగా బుధవారం రత్నగిరికి పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవున్ని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది భక్తులు స్వీకరించారు.


