పిఠాపురం: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక 27వ వార్డులో అధికార కూటమిలోని జనసేన పార్టీ నాయకులు సరికొత్త కుట్రకు తెర తీశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తమతో తీసుకుపోయి, కారులో దాచి, విత్‌డ్రా ఫారంపై సంతకం పెట్టించుకుని, దానిని అధికారులకు అందజేసి, ఏకగ్రీవం చేసుకునే కుయుక్తికి బరితెగించారు. వివరాలివీ.. 27వ వార్డు నుంచి తమ అభ్యర్థిగా కంభంపాటి శ్రీరామ్‌ను వైఎస్సార్ సీపీ ఎంపిక చేసింది. ఆ మేరకు ఆయన నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసినప్పటి నుంచి వార్డుల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు జనసేన నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురికి ఫోన్ల ద్వారా, మరికొందరికి రాయబారాలు, మరికొందరు అభ్యర్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి బెదిరింపులకు దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణ రోజైన బుధవారం నాటకీయ పరిణామాలకు తెర లేపారు. 27వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీరామ్‌ను కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు తమ కారులో ఎక్కించుకుని తీసుకుపోయారు. అక్కడే నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించి, ఆయన లేకుండానే అధికారులకు అందించారు. అప్పటికే ఉపసంహరణ సమయం ముగిసిపోయినప్పటికీ అధికారులు ఆ పత్రానికి ఆమోదం తెలిపి, తుది జాబితా ప్రకటించారు. అయితే, అందులో తమ అభ్యర్థి శ్రీరామ్ పేరు లేకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారు. ఆయన నామినేషన్ విత్‌డ్రా అయినట్లు అధికారులు చెప్పడంపై ఆ పార్టీ నాయకులు రావుల మాధవరావు, ముమ్మిడి శ్రీను తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసేసరికి పోటీలో ఉన్న తమ అభ్యర్థి ఆ తరువాత నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అధికారులు ఏవిధంగా ప్రకటిస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వార్డుల్లో ఏకగ్రీవాలు చేసేందుకు స్థానిక అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారనడానికి ఈ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. కాగా, ఈ ఘటన అనంతరం శ్రీరామ్‌కు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనసేన కండువా కప్పుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తీసుకుపోయిన జనసేన నాయకులు
విత్‌డ్రా పత్రంపై
బలవంతంగా సంతకం
ఆపై ఆయన లేకుండానే
నామినేషన్ ఉపసంహరణ
పిఠాపురం 27వ వార్డులో అధికారుల అత్యుత్సాహం
మండిపడిన వైఎస్సార్ సీపీ నేతలు
కలెక్టర్‌కు వంగా గీత ఫిర్యాదు


