ప్రత్తిపాడు రూరల్: వైఎస్సార్ సీపీ నుంచి మండల ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసే వారి పేర్లను ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు గురువారం ప్రకటించారు. ఎంపీపీ అభ్యర్థిగా ప్రత్తిపాడుకు చెందిన మాజీ జెడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి (జనరల్ మహిళ), జెడ్పీటీసీ అభ్యర్థిగా చిలకమర్తి వెంకట రమణ(బీసీ జనరల్)ను ఎంపిక చేశారు. బెహరా రాజరాజేశ్వరి, ఆమె భర్త వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు రాజకీయంగా మండలంలో సుపరిచితులు. రాజరాజేశ్వరి ప్రత్తిపాడు–3, ఆమె కుమార్తె లక్ష్మీ ప్రసన్న ప్రత్తిపాడు–2 నుంచి ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలోఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి చిలకమర్తి వెంకట రమణ పార్టీ నాయకుడిగా, దస్తావేజు లేఖరిగా స్థానికంగా గుర్తింపు పొందారు. వీరికి ఉన్న రాజకీయ పరిచయాలు, పార్టీ శ్రేణుల మద్దతు ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందనే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
భద్రతా ప్రమాణాలు పాటించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దీపావళి పండగ సందర్భంగా బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, వినియోగంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. దీపావళి బాణసంచా తయారీ యూనిట్లు, విక్రయ కేంద్రాలు, నిల్వకు సంబంధించిన లైసెన్సుల జారీ, రెన్యువల్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్ల సన్నద్ధతపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన విషాద ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖల అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముంచెత్తిన భారీ వర్షం
ఐ.పోలవరం: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రమైన అమలాపురంలో సుమారు 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమలాపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అయినవిల్లి, అల్లవరం తదితర మండలాల్లో ప్రధాన రహదారుల పైకి, పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లోకి భారీగా నీరు చేరింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్ వరి కోతలకు సిద్ధమవుతున్న వేళ.. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఉద్యాన పంటల రైతులకు మాత్రం ఈ వర్షం ఊరటనిచ్చింది. కొబ్బరి, అరటి, కూరగాయల పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని అంటున్నారు.
నామినేషన్ తిరస్కరణపై
సంసాని నాని ఫిర్యాదు
అమలాపురం రూరల్: మున్సిపాలిటీలోని 15వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి సంసాని చంద్రశేఖర్ (నాని) తన నామినేషన్ తిరస్కరణపై కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను మరోసారి ఆశ్రయించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్‌తో కలెక్టర్‌ను గురువారం కలసి వినతిపత్రం సమర్పించారు. నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అభ్యంతరాలను సమగ్రంగా పునఃపరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరారు. తన నామినేషన్ తిరస్కరణ కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో భాగమని అన్నారు. ఈ వ్యవహారాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వుల ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) అవసరం లేదని తెలియడంతో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి వెసులుబాటు కలిగిందని ఆయన పేర్కొన్నారు.
చిలకమర్తి వెంకట రమణ
బెహరా రాజరాజేశ్వరి


