పోలీసు పహారా నడుమ.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు పహారా నడుమ..

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

తొండంగి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గూండాలు స్వైరవిహారం చేస్తూ.. కొంత మంది అధికారులు, పోలీసు అధికారుల అండతో.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కాస్త అప్రమత్తమయ్యారు. దీంతో, తొండంగి మండలంలో నామినేషన్ల ప్రక్రియ పోలీసు పహారా నడుమ గురువారం ప్రశాంతంగా సాగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ, నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకుడు యనమల రాజేష్‌ ఆధ్వర్యాన ఆ పార్టీ వర్గీయులు దాడి చేసి, నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు. ఈ గూండాగిరీపై బాధిత అభ్యర్థులు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఫిర్యాదు చేయడంతో ఆయన నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులతో కలసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ వర్గీయులు బారికేడ్లను అడ్డం పెట్టి దాడికి యత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ వర్గీయులను అదుపు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని పోలీసులను దాడిశెట్టి రాజా కోరారు. లేకుంటే చట్టపరంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ మహంతి కిషోర్‌ ఆధ్వర్యాన తొండంగి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 120 మంది పోలీసులను ఉంచి, టీడీపీ వర్గీయులు రాకుండా పటిష్ట భద్రత కల్పించారు. దీంతో, వైఎస్సార్‌ సీపీకి చెందిన సీతారాంపురం ఎంపీటీసీ అభ్యర్థి, ఎంపీపీ అభ్యర్థి పెండ్యాల గంగారత్నం నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, మండల వ్యాప్తంగా 25 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ, కూటమి పార్టీల అభ్యర్థులు 79 నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ లక్ష్మి తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 35, టీడీపీ నుంచి 30, జనసేన నుంచి 11, బీజేపీ నుంచి 1, స్వతంత్రులు 2 కలిపి మొత్తం 79నామినేషన్లు దాఖలయ్యాయని వివరించారు. అలాగే, తొండంగి జెడ్పీటీసీ స్థానానికి శృంగవృక్షం గ్రాామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్‌ పప్పల వెంకట్‌మూర్తి నామినేషన్‌ వేశారు.

‘సాక్షి’ విలేకరిపై దాడికి జర్నలిస్టుల ఖండన

ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ఘర్షణలకు సంబంధించిన వార్త కవర్‌ చేసేందుకు వచ్చిన ‘సాక్షి’ విలేకిరి పోతుల జోగేష్‌పై టీడీపీకి చెందిన అంబుజాలపు సంతోష్‌ కుమార్‌, మరో వ్యక్తి దాడి చేసి, దౌర్జన్యంగా సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు ఎస్సై జగన్మోహన్‌రావు ఆ సెల్‌ఫోన్‌ రికవరీ చేసి, జోగేష్‌కు అప్పగించారు. రాజకీయాలకు అతీతంగా వార్తలు కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సీనియర్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు.

ఫ తొండంగిలో ఎట్టకేలకు

నామినేషన్ల పర్వం ప్రారంభం

ఫ ఎంపీటీసీ స్థానాలకు

79 మంది దాఖలు

ఫ 120 మందికి పైగా

పోలీసుల బందోబస్తు

ఫ పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ

తుని: ప్రజాస్వామ్యం అంటే పట్టింపు లేదు.. రాజ్యాంగం అంటే గౌరవం లేదు.. దీనికి అధికార మదం తోడైంది. ఆ అహంకారం ఫలితంగా తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం కాస్తా టీడీపీ గూండాగిరీ, దౌర్జన్యకాండకు వేదికగా మారింది. వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా.. ప్రజాస్వామిక విలువలకు పాతర వేస్తూ.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. తొండంగి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పోలీసుల సమక్షంలోనే బుధవారం సాగిన ఈ అరాచకం తుని నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణాన్ని సృష్టించింది. దీనికి కొనసాగింపా అన్నట్టుగా.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను పోలీసులు తుని మండలం ఎస్‌.అన్నవరంలో గురువారం హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్బంధ చర్యకు ఉపక్రమించారు. ఈ వరుస సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ సమాధానం చెప్పాలి

తొండంగి ఘటనలపై వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. తుని నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలకు జిల్లాకు చెందిన మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తొండంగిలో దాడులకు తెగబడటం ద్వారా టీడీపీ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించారని ధ్వజమెత్తారు. యాదవ సామాజికవర్గానికి చెందిన వృద్ధురాలు నామినేషన్‌ వేయడానికి వస్తే, బలవంతంగా లాక్కుని వెళ్లి నామినేషన్‌ పత్రాలు చించేశారని, అదేమిటని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఫలితంగా వైఎస్సార్‌ సీపీ విజయం సాధిస్తుందనే ఆందోళనతోనే కూటమి నేతలు పోలీసుల అండతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. దాడికి ప్రతిదాడి జరిగే ఎవరు బాధ్యులవుతారని ప్రశ్నించారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ నోరు విప్పి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement