పట్టు తప్పి.. గూడు చెదరి..! | - | Sakshi
Sakshi News home page

పట్టు తప్పి.. గూడు చెదరి..!

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

పిఠాపురం: ఉష్ణోగ్రతల్లో అస్తవ్యస్త మార్పులకు పట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పెంచిన పట్టు పురుగులు గూళ్లు అల్లుకునే నాలుగు, ఐదు దశల్లో చనిపోతుండడంతో కనీస పెట్టుబడులు రాక రూ.కోట్లలో నష్టపోతున్నారు. వాతావరణంలో విపరీత మార్పుల వల్ల ‘ప్రాచీన్‌’, ’గ్రాసరీ’ వంటి వైరల్‌ వ్యాధులు వ్యాపించి గూడు పెట్టే దశలో పురుగులు చనిపోతుండడం ఒక కారణమైతే, ప్రభుత్వ, ప్రైవేటు చాకీ సెంటర్ల నుంచి సరఫరా అయ్యే గుడ్లు, పురుగులలో నాణ్యతా లోపం మరో కారణమని రైతులు అంటున్నారు.

లక్షల్లో పెట్టుబడి

ఎకరం మల్బరీ తోట నిర్వహణకు ప్రతి విడతకూ రూ.70 వేల నుంచి రూ.లక్ష వ్యయమవుతుంది. పురుగులు గూళ్లు అల్లే చివరి నాలుగు, ఐదు దశల్లో ఉష్ణోగ్రతల్లో విపరీత మార్పుల వల్ల అవి చనిపోతుండడంతో పెట్టుబడులు, కష్టం వృథాపోతున్నాయి. ప్రభుత్వం, పట్టు పరిశ్రమల శాఖ తక్షణం స్పందించి ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..

రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు జిల్లాలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కోనసీమలోని అమలాపురం, రాజమహేంద్రవరం మినహా ఎజన్సీలో 5, పెద్దాపురం డివిజన్‌లో 12, కాకినాడ డివిజన్‌లో 2 మండలాల్లో 4500 ఎకరాల్లో 1100 మంది రైతులు మల్బరీ సాగు చేసేవారు. ఇలా రోజుకు ఐదు టన్నుల పట్టుగూళ్లు దిగుబడి ఉండేది.

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

గతంలో జిల్లాలో పండించిన పట్టుగూళ్లకు కేజీ రూ.550 వరకు ధర పలకగా ప్రస్తుతం రూ.250 కూడా పలకక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌ సైతం రూ.4 కోట్ల మేర బకాయి పెట్టింది. షెడ్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు లేవు. వీటన్నింటికీ తోడు తెగుళ్ల బెడదతో పురుగులు గూళ్ల కట్టని పరిస్థితి నెలకొంది.

పక్క పొలాల్లో పురుగు మందుల వల్లే..

రైతుల విజ్ఞప్తితో మల్బరీ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు సమీప పొలాల్లో పిచికారీ చేస్తున్న పురుగు మందుల వల్లే పట్టు పురుగులు చనిపోతున్నాయని చెప్తున్నారు. పంట నష్టాలకు కారణమవుతున్న తెగుళ్ల నివారణ చర్యలను ఇప్పటికీ అధికారులు చెప్పకపోవడంతో అసలు సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు.

చేబ్రోలులో కనుమరుగు కానున్న మల్బరీ తోటలు

చేబ్రోలులో పట్టు పురుగుల పెంపకం షెడ్‌

గూళ్లు కట్టే వేళ

చనిపోతున్న పట్టు పురుగులు

ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులతో వైపరీత్యం

రూ.లక్షల్లో ఖర్చుచేసి నష్టపోతున్న రైతులు

మూడు వేల నుంచి 300ఎకరాలకు

పడిపోయిన మల్బరీ సాగు

పట్టించుకునే వారు లేరు

పంటలు నష్టపోతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చేబ్రోలులో ఇప్పటికే 50 మంది వరకు రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. కలెక్టర్‌ మా సమస్యను పరిశీలించి ఆదుకోవాలి.

– వులవకాయల రాంబాబు,

పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

సాగంటేనే భయమేస్తోంది

గతంలో పట్టు సాగంటే పరుగులు తీసే రైతులు నేడు భయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పంటకు దూరమయ్యారు. మండలంలో పట్టు సాగు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతోంది. పట్టు పురుగు గూడు ఎందుకు కట్టడం లేదో శాస్త్రవేత్తలు పరిశోధించి నివారణ చర్యలు సూచించాలి.

– ఓరుగంటి రామారావు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement