చింతూరు: మండలంలోని లక్కవరం ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ని ఫినాయిల్ తాగినట్లు తెలిసింది. పాఠశాలలో గురువారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం ఆమె తండ్రితో కలసి పాఠశాలకు రాగా తండ్రి వెళ్లిన కొద్దిసేపటికి ఆమె డార్మెటరీలో వున్న ఫినాయిల్ తాగినట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను తొలుత సమీపంలోని తులసిపాక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి చింతూరు సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించినట్లు సమాచారం. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకున్నట్లు తెలిసింది. కాగా ఆమె ఫినాయిల్ తాగడానికి కారణాలు తెలియరాలేదు. పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్‌సింగ్‌ను వివరణ కోరగా తాను ప్రస్తుతం అరకులో వున్నానని, పాఠశాలకు వచ్చిన అనంతరం ఈ ఘటనపై సమాచారం సేకరిస్తానని తెలిపారు.
కోలుకుంటున్న క్షతగాత్రులు
తుని రూరల్: బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లి బృందం సభ్యులు కాకినాడలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులలో కోలుకుంటున్నారు. గురువారం తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సును కంటైనర్ డీకొనడంతో జరిగిన ప్రమాదంలో 43 మందికి గాయపడగా 108 అంబులెన్సుల్లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారు మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రులలో చేరారు. స్వల్పంగా గాయపడిన వారు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుంది.
విద్యుదాఘాతంతో
వివాహిత మృతి
తొండంగి: మండలంలోని బెండపూడిలో విద్యుత్‌షాక్ గురై వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం గిడజాం గ్రామానికి చెందిన యర్రా శివాజి, యర్రా జ్యోతి (32) దంపతులు వీరికి 13 ఏళ్ల కుమార్తె సత్య, తొమ్మిదేళ్ల కుమారుడు అనిరుధ్ ఉన్నారు. జ్యోతి స్వగ్రామమైన బెండపూడిలో ఐదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. శివయ్య స్థానికంగా దాబాలో పనిచేస్తుండగా జ్యోతి బెండపూడి వైజంక్షన్ వద్ద ఓ ప్రైవేటు బేకరీ షాపులో పనిచేస్తోంది. శుక్రవారం ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఆ తడి చేతులతో విద్యుత్ మీటర్ వద్ద స్విచ్ ఆన్ చేయగా షాక్‌కు గురై పక్కనే ఉన్న ఇనుప గేటుకు తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జ్యోతి తల్లి సమాచారం మేరకు శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంట కాలువలో పడి
యువకుడి మృతి
కరప: మండలం అరట్లకట్ట గ్రామంలో ఓ యువకుడు కాలు జారి పంట కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన కొల్లి సోమశేఖర గౌరీ ప్రసాద్ (32) మార్కెట్‌లో కూలి పనులు చేస్తుంటాడు. అతనికి మతిస్థిమితం లేదని స్థానికులు తెలిపారు. శుక్రవారం అరట్లకట్ట సమీపంలోని పంట కాలవలో మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని బయటకు తీశారు. మృతదేహం గౌరీ ప్రసాద్‌దిగా స్థానికులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గౌరీ ప్రసాద్ తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తోట సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000
కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 24,500
గటగట (వెయ్యి) 22,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 23,500
గటగట (వెయ్యి) 21,000
నీటికాయ
పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000
కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000
కిలో 350


