సెల్‌ టవర్ల బ్యాటరీ దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్ల బ్యాటరీ దొంగల అరెస్టు

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

కారు, 67 బ్యాటరీలు, రూ. 3.75 లక్షల నగదు స్వాధీనం

ప్రత్తిపాడు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్న కాలంలో వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ టవర్ల బ్యాటరీల చోరీలకు పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయా టవర్లలో పనిచేసే టెక్నిషీయన్లే ఈ చోరీలకు పాల్పడం విశేషం. కొన్ని బ్యాటరీలతో కారులో వెళ్తున్న నిందితులను మండలంలోని లంపకలోవ గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ ఏబీజీ తిలక్‌ శుక్రవారం సాయంత్రం విలేకరులకు ఆ వివరాలను అందించారు. కొంత కాలంగా ప్రత్తిపాడు, అన్నవరం, కిర్లంపూడి, గండేపల్లి, పిఠాపురం, తొండంగి, తుని, అనపర్తి తదితర ప్రాంతాల్లో వరసగా సెల్‌ ఫోన్‌ టవర్ల బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు అందిన మేరకు ఈ బ్యాటరీల నిర్వహణ తెలిసిన వారే ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. సీఐ బి.సూర్య అప్పారావు పర్యవేక్షణలో ఎస్సై ఎస్‌.లక్ష్మీకాంతం సిబ్బందితో ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు. శుక్రవారం 11 అమర్‌రాజ్‌ 600 ఎంఏహెచ్‌ బ్యాటరీలతో వెళ్తున్న కారును లంపకలోవ గ్రామ సమీపంలో ఎస్సై లక్ష్మీకాంతం అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న గొల్లప్రోలు మండలం తాటిపర్తికి చెందిన ఎయిర్‌టెల్‌ టెక్నీషియన్‌ అమలకంటి సూరిబాబు అనే సురేంద్ర, తుని మార్కెండేయ పేటకు చెందిన ఎయిల్‌టెల్‌ టెక్నీషియన్‌ చిదం కనక దుర్గా పార్థసారధి అనే పార్థు, తుని గవరపేటకు చెందిన ఏటీసీ టెక్నీషియన్‌ అల్లవరపు వెంకటేష్‌ మరికొంత మంది ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో వరస దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితులు ఇచ్చిన వాగ్మూలం మేరకు చోరీ చేసిన బ్యాటరీలను తుని గ్రామానికి చెందిన పాత ఇసుప సామాను కొట్టు యజమాని పులి రామకృష్ణారెడ్డికి విక్రయిస్తున్నారు. వీరి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం జిల్లాలో రూ.4 లక్షల విలువ చేసే 374 బ్యాటరీలు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందాయి. అయితే వీటిలో 56 సెల్‌ టవర్లకు చెందిన 67 బ్యాటరీలను, కొన్నింటిని విక్రయించగా వచ్చిన రూ.3.75 లక్షల నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని, నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు తెరిచి, ఆయా స్టేషన్లకు పంపిస్తామని డీఎస్పీ తిలక్‌ తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై ఎస్‌.లక్ష్మీకాంతం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement