సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ/సీటీఆర్‌ఐ: రెడ్‌బుక్ రాజ్యంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు, మేధావులు ధ్వజమెత్తారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో క్షీణించిన శాంతిభద్రతలపై వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, మేధావులు తరలివచ్చి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి, దహనం చేసిన సంఘటన.. కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానంటూ మాదిగ యువకుడు పురుపోగు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పిన ఉదంతం.. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొని చంపడం.. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం వంటి దారుణ ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూటమి నాయకుల చేతిలోకి చేరడంతో పోలీసులు వారికి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. అరాచక శక్తులకు పాలకులే అండగా నిలుస్తున్నారన్నారు. అందువల్లనే కొన్ని దుష్టశక్తులు పేట్రేగిపోతున్నాయని చెప్పారు. గంజాయిని పాలకులే పెంచి పోషిస్తున్నారన్నారు. చంద్రబాబు చేతిలో పోలీసు వ్యవస్థ కీలుబొమ్మలా తయారైందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దేశిరెడ్డి బలరామనాయుడు, వీఎస్‌ఎస్ కృష్ణకుమార్, రిటైర్డ్ సీఐ సాల్మన్‌రాజు, కల్తీ పాల ఘటన బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, వాసంశెట్టి గంగాధరరావు, తోట రామకృష్ణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కె.సాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము తదితరులు పాల్గొన్నారు.
ఫ చంద్రబాబు ప్రభుత్వంలో
మహిళలకు రక్షణ కరువు
ఫ పాలకులే గంజాయి, మద్యం, మతం మత్తు వ్యాప్తి చేస్తున్నారు
ఫ బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్నారు
ఫ ఒక్క ఘటనలోనూ బాధితులకు న్యాయం జరగడం లేదు
ఫ పాలకుల అసమర్థతతో
నేరస్తులు చెలరేగిపోతున్నారు
ఫ ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న వారే ప్రస్తుత సీఎంలు
ఫ కూటమి సర్కారుపై అఖిల పక్ష నాయకులు, మేధావుల మండిపాటు


