బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బ్యాకింగ్ రంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యునియన్ పిలుపుమేరకు బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం ఒకరోజు సమ్మె చేపట్టారు. జిల్లాలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొని నినాదాలు చేశారు. కాకినాడ భాస్కర్‌నగర్ కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులందరూ ఉదయం 10 గంటల నుంచి నిరసనలో పాల్గొని ఐదు రోజుల పని ఒప్పందం అమలు చేయాలని, పీఎల్‌ఈ స్కీమ్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల బాటలో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించలేని పక్షంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సమ్మెకు బ్యాంక్ ఉద్యోగుల సంఘ ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ కె.ఆదినారాయణ, బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీనివాస్, రామ్‌కుమార్, వివిధ బ్యాంకుల ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.


