కాజులూరు: కోరంగి కెనాల్‌లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం వేళంగి శివారు కొత్తపేటకు చెందిన పలువురు యువకులు బుధవారం రాత్రి యానాం వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరిలో మచగిరి రాజు (20) అనే యువకుడు కాజులూరు మండలం జగన్నాథగిరిలో తోట త్రిమూర్తులు వారధి వద్ద కోరంగి కెనాల్‌లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గురువారం కాలువలో గాలింపు చేపట్టారు. శీల గ్రామం వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. జగన్నాథగిరి వీఆర్‌ఓ ఈశ్వరరావు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గొల్లపాలెం ఎస్సై ఆర్‌వీఎన్ మూర్తి తెలిపారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని తాళ్లపొలంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ద్రాక్షారామ హెడ్ కానిస్టేబుల్ పి.మల్లికార్జునరావు కథనం ప్రకారం.. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన తేతల వెంకటరెడ్డి (50) తాళ్లపొలం గ్రామంలోని ఉప్పు దయానందం ఇంటి పునాదిలో ఇసుక నింపుతున్నాడు. ఆ సమయంలో మోటారుకు కలిపిన విద్యుత్ వైరు ప్రమాదవశాత్తూ తగిలి షాక్‌కు గురయ్యాడు. మిగిలిన కూలీల సహకారంతో అతడిని దయానందం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


