బీసీల పాలిట తెగులు టీడీపీ | - | Sakshi
Sakshi News home page

బీసీల పాలిట తెగులు టీడీపీ

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

వారిని ఎదగకుండా చేశారు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు

రాజమహేంద్రవరం రూరల్‌: టీడీపీ బీసీలను ఎదగనీయకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పచ్చ పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారని, నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని విమర్శించారు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, బీసీలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వేణు విమర్శించారు. ఈ తెగులు వల్లనే 1997లో ఐటీ రంగంలో బూమ్‌ వచ్చినా బీసీలు ఆ రంగంలోకి రాలేకపోయారని అన్నారు. బీసీలను కులవృత్తులుగా, పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో విద్యకు దూరం చేశారని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటీ రంగంలో ఎదిగారని చెప్పారు. అలాగే, గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 34 శాతానికి మించి 40 శాతం వరకూ రిజర్వేషన్‌ ఇచ్చి, వారికి పదవులు దక్కేలా చర్యలు చేపట్టి, స్థానిక ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్‌ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తామంటూ 105 జీఓ ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పును అధిగమించి మరీ హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి మొదటి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు పెట్టి, కనీసం రూ.వెయ్యి కూడా ఖర్చు చేయలేదని వేణు అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్‌లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లున్న బీసీలకు పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రలోభాలు ఎర వేసి తమ పార్టీలోని బీసీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. వీటన్నింటినీ ఎండగట్టడానికి టీడీపీ వెన్నుపోటు గురించి ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్‌ సీపీ నిర్ణయించిందని వేణు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement