నిరుద్యోగులపై అక్రమ కేసులా! | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులపై అక్రమ కేసులా!

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

కాకినాడ రూరల్‌: ఉద్యోగాల కోసం కాకినాడలో శాంతియుతంగా ధర్నా చేసిన నిరుద్యోగులపై పోలీసు నిర్బంధాన్ని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమేమిటని, వాటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం నిరసన తెలిపితే, వారికి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న 20 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులతో వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్న శ్యామ్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు జి.శ్యామ్‌పై కేసు పెట్టడం సరి కాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నాగమణి డిమాండ్‌ చేశారు.

జీఓ ప్రకారం జీతాలివ్వాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు జీఓ ప్రకారం జీతాలివ్వాలని ఏపీఎస్‌ ఆర్టీసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు మలకా వెంకట రమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి కె.రమేష్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కాకినాడ, పెద్దాపురం, ఏలేశ్వరం, తుని, పిఠాపురం తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీఓ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. మరోవైపు జీతాలను కార్మికుల బ్యాంకు ఖాతాలో కాకుండా నగదు రూపంలో ఇస్తున్నారని, ఆ సమయంలో కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తంలో కోతలు పెడుతున్నారని తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో స్వీపర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, వాషింగ్‌లో పని చేసే వారికి జీతాల్లో బాగా కోతలు పెడుతున్నారని చెప్పారు. తక్షణమే వేతనాల కోతను నిలుపు చేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫాం, ఇతర భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకుడు మేడిశెట్టి వెంకట రమణ కూడా పాల్గొన్నారు.

ధాన్యం సేకరణకు

ముందస్తు ఏర్పాట్లు చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా, రైతులకు అనుకూలంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ గడువులోగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణకు రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు, ఇంటర్నెట్‌, కంప్యూటర్లు, ప్రింటర్లు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు వంటివన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. సేకరణ ప్రారంభానికి ముందే క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్‌ మిల్లుల పరిధిలోని వే బ్రిడ్జిలను తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసి, అవసరమైన స్టాంపింగ్‌ పూర్తి చేయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని ముందుగానే నియమించి, శిక్షణ అందించాలని సూచించారు. గోనె సంచులు, గోదాములు, తగినంత మంది హమాలీలను అందుబాటులో ఉంచాలని జేసీ అన్నారు.

స్విమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స

తిరుపతి తుడా: తిరుపతిలోని స్విమ్స్‌ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యాన ఓ పేద రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలివీ.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన బి.వెంకట సూరిబాబు (50) మూడు నెలలుగా గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. పలు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో, అతడు స్విమ్స్‌ ఆసుపత్రిని సంప్రదించారు. సూరిబాబును వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించి ప్రాణదానం పథకం కింద ఎంపిక చేసి, సీఆర్‌టీ–డీ పరికరం అమర్చారు. లక్షల రూపాయల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా విజయవంతంగా చేశారు. టీటీడీ, స్విమ్స్‌ అధికారులకు, వైద్యులకు రోగితో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement