నిడదవోలు రూరల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలేనికి చెందిన మరపట్ల రాజ్‌కుమార్, రాజమహేంద్రవరం చర్చిపేట ప్రాంతానికి చెందిన చిప్పాడ ప్రవీణ్ కుమార్‌లు గతంలో వేర్వేరు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వీరిద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం లోహియా నగర్ వద్ద కవర్‌లో పెట్టి గంజాయి విక్రయిస్తూండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.080 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే తాడేపల్లిగూడెం, నిడదవోలుతో పాటు పలు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదయ్యాయి. ప్రవీణ్ కుమార్‌పై గంజాయి విక్రయాలకు సంబంధించిన కేసులున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


