మళ్లీ చివరాఖరుకే.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ చివరాఖరుకే..

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

అన్నవరం: భక్తులకు సేవలు అందించే విషయంలో అన్నవరం దేవస్థానం ర్యాంకు మళ్లీ చివరాఖరుకు దిగజారిపోయింది. రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత ఆగస్టు 5 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్‌, వాట్సాప్‌ యాప్‌ సర్వే నిర్వహించింది. ఇందులో 66.6 శాతంతో అన్నవరం దేవస్థానం చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఏకంగా 33.4 శాతం మంది భక్తులు.. అంటే దేవస్థానానికి వచ్చిన ప్రతి ముగ్గురు భక్తుల్లో ఒకరు ఇక్కడి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా చివరి స్థానంలోనే నిలిచింది. ఆ సందర్భంగా అప్పటి కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది అందరూ మెరుగైన సేవలందించడం ద్వారా దేవస్థానాన్ని మొదటి స్థానంలో నిలపాలని ఆదేశించారు. ఆ తరువాత కొంత మెరుగుదల సాధించి, ఒక దశలో మొదటి స్థానానికి చేరింది. ఆ తరువాత 4, 5 స్థానాలకే పరిమితమవుతూ వస్తోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత అన్నవరం దేవస్థానం మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అన్ని దేవస్థానాలపై అసంతృప్తి

సర్వే నిర్వహించిన ఏడు దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై భక్తులు కాస్త అధికంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం సంతృప్తిగా జరిగిందా అనే ప్రశ్నకు గత సర్వేలో 70.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 69.8 శాతానికి తగ్గింది. తాగునీటి వసతుల్లో గత సర్వేలో సంతృప్తి శాతం 65.6 శాతం కాగా, తాజాగా 62.7 శాతానికి పడిపోయింది. ప్రసాదాలపై గతంలో సంతృప్తి శాతం 76.9 కాగా ఈసారి 75.1 శాతానికే పరిమితమైంది. పారిశుధ్యంపై గత సర్వేలో సంతృప్తి శాతం 64.4 కాగా, ఈసారి అది 61.4 శాతానికి తగ్గింది.

ఫ ప్రభుత్వ సర్వేలో దిగజారిన ర్యాంకు

ఫ అన్నవరం దేవస్థానం.. 66.6 శాతంతో ఆఖరి స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement