సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ కవి, రచయిత, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ రచించిన కన్నీటి సంతకం కథల పుస్తకాన్ని వేదిక అంతర్జాతీయ ప్రతినిధి, పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ జేమ్స్‌వాట్ కొమ్ము ఆవిష్కరించారు. నగరంలోని సోన్స్ సాఫ్ట్‌వేర్ కార్యాలయంలో కళావేదిక జాతీయ కో ఆర్డినేటర్ కేతా శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు భద్రం మాట్లాడు తూ, ప్రతాప్ కుమార్ రాసిన కథలు ఎందరివో జీవితాలకు దర్పణాలని అన్నారు. ఈ కథలు చ దువుతూంటే మనసు ద్రవిస్తుందని, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలను, బాధలను, మానవీయ సంబంధాలను ఈ కథలు కళ్ల ముందు నిలబెడతాయని అన్నారు. జేమ్స్ వాట్ మాట్లాడుతూ, కన్నీటి సంతకం కథలు నేటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయన్నారు. కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు, మనిషిలోని ఆర్ధ్రత, సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ కథల్లో సజీవంగా కనిపిస్తాయని అన్నారు.


