పిఠాపురం రూరల్: కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన రహదారులు కొద్ది నెలల్లోనే గోతులు, ప్యాచ్ వర్క్‌లతో దర్శనమివ్వడంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారిని 8.2 కిలోమీటర్ల మేర 8 నెలల క్రితం సుమారు రూ.15 కోట్లతో నిర్మించారు. ఇంతలోనే ఈ రహదారిపై గోతుల పడి, వాటికి ప్యాచ్ వర్కులు చేయడం, కొద్దిరోజులకే మళ్లీ అవి కంకర తేలి గోతులు పడి అస్తవ్యస్తంగా మారింది.
రహదారి మొత్తంలో 48 ప్యాచ్‌లు..
8.2 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలో 48 చోట్ల గోతులు ఏర్పడి వాటికి మరమ్మతుల పేరుతో వేసిన కంకరతో చూసిన వారికి అది రహదారా లేక అతుకుల బొంతా అన్నట్టు తయారైంది.
కల్వర్టులపైనే అధికం
ఈ మొత్తం రహదారిలో చాలా మటుకు దెబ్బతిన్న భాగాలన్నీ కల్వర్టులపైనే కావడం గమనార్హం. పాత కల్వర్టులు కావడం వల్లే ఆయా ప్రాంతాల్లో వేసిన రహదారులు సరిగా అమరక, అతుక్కోక ఇలా దెబ్బ తిన్నట్టు చెప్తున్నారు. ఇందుకు కారణాలను సంబంధిత అధికారులు, సాంకేతిక నిపుణులే చెప్పాల్సి ఉంటుంది. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారి కావడంతో దీనిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఒరిపిడి ఎక్కువై తరచూ గోతులు పడుతున్నట్టు వాహన చోదకులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో కల్వర్టుల వద్ద గోతులు కనపడక మరిన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ద్విచక్ర వాహన చోదకులు అంటున్నారు.
పర్యవేక్షణ లేకపోవడం వల్లే
ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన ఆర్‌అండ్‌బీ అధికారులు గుత్తేదారులతో పెనవేసుకున్న బలమైన బంధాల వల్ల ఆయా నిర్మాణాల సమయంలో పర్యవేక్షణ ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.15 కోట్లతో రహదారి నిర్మిస్తున్నారంటే గ్రావెల్ పొరలు, వాటికి నీరు పెట్టడాలు, వాటిపై కంకర పొరలు, వాటిపై రోలర్‌తో అణగదొక్కి దానిపై తారు కంకర మిక్స్చర్ ఎంత మందాన వేయాలో సరైన పర్యవేక్షణ జరిగిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంత మొత్తంలో నిధులు వెచ్చించినా చివరికి పై పూతలు మాత్రం తప్పలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమగ్ర విచారణ చేపట్టాలని...
ఈ రహదారిపై ఉన్నతాధికారులు సమగ్ర సాంకేతిక తనిఖీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిలోని కల్వర్టులన్నింటినీ అధికారులు పరిశీలించి, వాటిపై వేసిన రహదారి నాణ్యతను పరీక్షించాల్సి ఉంది. లోపాలున్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
రూ.15 కోట్లతో రహదారి నిర్మాణం
8 నెలల్లో 48 చోట్ల రాళ్లు తేలి గోతులు
వాటిపై అతుకుల
బొంతలా కంకర పూతలు
పిఠాపురం–సామర్లకోట రహదారి దుస్థితి


