● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
● పరారీలో ముగ్గురు..
● రూ.12 లక్షల విలువైన
పది వాహనాల స్వాధీనం
నిడదవోలు: ఇళ్ల వద్ద పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను రాత్రి వేళలో దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ పీవీజీ తిలక్ ఆ వివరాలను వెల్లడించారు. తణుకు పట్టణానికి చెందిన అబ్దుల్లా ఆదీబ్ రెహ్మాన్, తాళ్లపూడి సతీష్, ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామానికి చెందిన గాలింకి మనోజ్ కుమార్, మన్యం సందీప్, మోర్త గ్రామానికి చెందిన వెలగట్ల జస్వంత్, పెరవలి మండలం ముక్కామలకు చెందిన దొంగ ప్రవీణ్‌కుమార్, నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉమర్ అలీషాలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ బృందంలో గౌతం, రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన విఘ్నేష్, తణుకు పట్టణానికి చెందిన పెట్ట శ్యామ్ ఆస్టియన్ పరారీలు ఉన్నారని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిందితులు రాత్రిపూట మూడు బైక్‌లపై తిరుగుతూ ఇళ్లల్లో తాళం వేసి ఉన్న మోటార్‌సైకిళ్లను గుర్తించి అపహరిస్తారని సీఐ వెల్లడించారు. ఈ బృందంలోని గౌతమ్ ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నాడని, అతడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన ఉండ్రాజవరం, సమిశ్రగూడెం ఎస్సైలు డి.రవికుమార్, బాలాజీ సుందరరావులను ఎస్పీ డి.నరసింహ కిశోర్ రివార్డులు ప్రకటించారని సీఐ తిలక్ తెలిపారు.


