సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

రాజమహేంద్రవరం రూరల్‌: హుకుంపేట గ్రామానికి చెందిన స్వర్గీయ సత్యవోలు పాపారావు చిన్న కోడలు వడ్డాది గౌరి హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈపీ డీసీఎల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కె. తిలక్‌ కుమార్‌, రాజమహేంద్రవరం టౌన్‌ డివిజన్‌ కార్యనిర్వహక ఇంజినీర్‌ నక్కపల్లి శామ్యూల్‌ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హుకుంపేట గ్రామానికి చెందిన వల్లేపల్లి సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు ఈ స్థలాన్ని వితరణ చేశారు. ఈ మేరకు బుధవారం కడియం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఈఈ శామ్యూల్‌కు గౌరి సదరు పత్రాలను అందజేశారు. ఈ మేరకు దాత గౌరికి సీఎండీ పృథ్వీతేజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.2.97 కోట్లు

ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా 35 రోజులకు రూ.2,97,95,990 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గతంలో కంటే ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గతంలో రోజుకు హుండీల ద్వారా రూ.7,93,823 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.8,51,314 సరాసరి ఆదాయంగా లభించినట్లు తెలిపారు. కాగా వాడపల్లి ఆలయ ఆవరణలో ఆలయ హుండీలను బుధవారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈవోలు బి.కిరణ్‌(గోపాలపురం), మడికి గ్రూపు దేవాలయాల ఈవో ఎం.శివరామకృష్ణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి ప్రధాన హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,81,93,365, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.1,16,02,625 రూపాయలు లభించాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement