చేనేత మగ్గానికి కూటమి పగ్గం | - | Sakshi
Sakshi News home page

చేనేత మగ్గానికి కూటమి పగ్గం

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

పిఠాపురం: నేత కార్మికుల అద్భుత కళతో రంగుల వస్త్రాలను నేసే మగ్గం నేడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మూగబోతోంది. పడుగు గంజి లేక పేక దారంలా నూలు పోగు తెగి నేత పరిశ్రమ పడకేసింది. కడుపు నింపే పని ఆకలి తీర్చలేక పోతుండడంతో కుల వృత్తిని వదిలి వలస వెళ్లే పరిస్థితి దాపురించింది. చేనేత పరిశ్రమను, కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారం చేపట్టాక చేతులెత్తేశారు. గత రెండున్నరేళ్లుగా ఒక్క పైసా కూడా విదల్చకుండా నేత కార్మికులకు మోసం చేశారు. గత జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చారు తప్ప, అమలు మాత్రం చేయలేదు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల సేవ అమలు చేస్తామని ప్రచారం చేస్తున్నా ఇప్పటికీ కేవలం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే జరుగుతుంది. కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడుమిల్లి, ఉప్పా డ, అమీనాబాద, మూలపేట, తాటిపర్తి, చేబ్రోలు, ధర్మవరం, తుని తదితర ప్రాంతాల్లో పలు కుటుంబాలు నేత పనిపై ఆధారపడి జీవిస్తున్నాయి.

గత రెండేళ్లలో రూ.36 కోట్ల ఎగవేత

ఎన్నికల సమయలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ రెండేళ్లలో సుమారు రూ.36 కోట్లు ఇవ్వాలి. కానీ ఆ సొమ్మును కూటమి ప్రభుత్వం ఎగవేసింది. ఇప్పుడు ఇస్తామని చెబుతున్నప్పటికీ లబ్ధిదారుల ఎంపిక అనుమానాస్పదంగా ఉండడంతో నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అదే గతంలో జగన్‌ ప్రభుత్వ హయాంలో 2019 – 20లో 6,964 మంది లబ్ధిదారులకు రూ.16.71 కోట్లు, 2020 – 21లో 7,817 మందికి రూ.18.76 కోట్లు, 2021 – 22లో 6,919 మందికి రూ.16.60 కోట్లు, 2022 – 23లో 7,973 మందికి రూ 19.13 కోట్లను నేతన్న నేస్తం పథకం ద్వారా అందజేశారు.

మార్గదర్శకాలు లేకుండా..

నేతన్నల సేవ పథకానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు నేత కార్మిక కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుండగా అదే జరిగితే అద్దె భవనాల్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఫ ముందుకు సాగని పరిశ్రమ

ఫ రెండేళ్లుగా నేత

కార్మికులకు సాయం ఎగవేత

ఫ ఈసారీ ఇచ్చేది అనుమానమే!

ఫ దరఖాస్తుల స్వీకరణలోనే అధికారులు

ఫ ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

నేతన్నల సేవ పథకం ద్వారా ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి నేత కార్మికుల నుంచి చేనేత సొసైటీల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం.

– సూరిబాబు,

జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి, కాకినాడ

మగ్గాన్ని వదిలేసే పరిస్థితి

చేనేతను వదిలేసి, మగ్గాన్ని పక్కన పెట్టి ఇతర వృత్తుల్లోకి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి దారుణ పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. నేసిన చీరలు అమ్ముడు పోక మాస్టర్‌ వీవర్స్‌ కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లభించడం లేదు.

– బత్తుల లోవకృష్ణ, నేత కార్మికుడు,

తాటిపర్తి, గొల్లప్రోలు మండలం

బతుకు భారం

నేను చిన్నప్పటి నుంచి నేత పని చేస్తున్నాను. ప్రభుత్వం ఎటువంటి సహకారం లభించకపోవడంతో మా బతుకు భారంగా మారింది. మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. అలాగని ఇది చేస్తున్నా కడుపు నిండడం లేదు. అప్పుల పాలై దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం.

– అవ్వాడ సత్యనారాయణ, నేత కార్మికుడు,

తాటిపర్తి, గొల్లప్రోలు మండలం

సాయం చేయలేదు

మా గ్రామంలో సుమారు 600 మంది వరకు నేత నేసేవారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో సగం మంది వేరే పనులకు వెళ్లిపోతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కరోనా సమయంలో కూడా నేతన్న నేస్తం డబ్బులు వేసి ఆదుకున్నారు. కానీ రెండేళ్లుగా ఈ ప్రభుత్వం ఏమీ సాయం చేయడం లేదు.

– గుణ శేఖర్‌, నేత కార్మికుడు,

తాటిపర్తి, గొల్లప్రోలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement