అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన సత్యగిరిని పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నం, దేవస్థానం తీసుకున్న చర్యలపై కలెక్టర్ హరేంధర ప్రసాద్ మంగళవారం ఆరా తీశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘పోడు పొచ్చాలు శీర్షికన, మంగళవారం ‘సత్యగిరిపై ఇదేం కిరికిరి’ శీర్షికన వార్తలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహరంపై నివేదిక ఇవ్వాలని ఆయన దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావును ఆదేశించారు. దీంతో జరిగిన విషయాన్ని వివరిస్తూ సత్యగిరిపై 1998లో దేవస్థానం కొనుగోలు చేసిన 303 ఎకరాల భూమి సరిహద్దులు నిర్ణయించడానికి సర్వే చేయించి, సరిహద్దు వెంబడి రాళ్లు పాతించి తరువాత ఫెన్సింగ్ చేయించనున్నట్టు కలెక్టర్‌కు ఈఓ నివేదిక పంపారు.
ఆర్డీవో పరిశీలన
కొండపోడు పేరుతో ఆక్రమణయత్నం జరిగిన సత్యగిరిలోని గిరి ప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్డీఓ జి కృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. కొండను సర్వే చేయించి వెంటనే సరిహద్దులో సర్వే రాళ్లు పాతించాలని దేవస్థానానికి ఆయన ఆదేశించారు. ఈ మేరకు దేవస్థానానికి సహకరించాలని శంఖవరం, తొండంగి తహసీల్దార్లు ఎం.సూరిబాబు, కె.కాంతారావుకు సూచించారు. ఆయన వెంట దేవస్థానం ఏఈఓ అనకాపల్లి ప్రసాద్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ పప్పుల వెంకట రమణ, విశ్రాంతి ఆర్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు. సత్యగిరిని సర్వే చేసిన అనంతరం పాతడానికి 200 సర్వే రాళ్లను కోటనందూరు మండలం గన్నవరం మెట్ట నుంచి తెప్పిస్తున్నట్టు ఈఓ తెలిపారు. కాగా.. సత్యగిరి కొండ దిగువన గత నెలలో పోలవరం ప్రాజెక్టు అధికారులు గ్రావెల్ కోసం తవ్విన ప్రదేశాన్ని ఆర్డీఓ కృష్ణమూర్తి పరిశీలించారు. విశ్వహైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్రమంగా తవ్విన చోటును పూడ్చి ఆ స్థలంలో మొక్కలు నాటి అడవిగా అభివృద్ధి చేయాలని కోరారు.
·˘ ‘సాక్షి’ లో వచ్చిన కథనాలకు స్పందన
·˘ పోడు వ్యవసాయం చేసిన భూములను
పరిశీలించిన ఆర్డీఓ కృష్ణమూర్తి


