దర్శన భారము నీదే స్వామీ! | - | Sakshi
Sakshi News home page

దర్శన భారము నీదే స్వామీ!

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

బ్యాటరీ కార్లు లేక వృద్ధులు, వికలాంగుల అవస్థలు

ఎన్నిసార్లు మరమ్మతు చేసినా మళ్లీ మూలకే

శ్రావణానికి అందుబాటులోకి

తీసుకువస్తామంటున్న ఈఓ

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యం వినియోగించే బ్యాటరీ కార్లు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై గ్యారేజీకి చేరాయి. ప్రధానంగా ఆలయ పశ్చిమ రాజగోపురం వైపే భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. రెండో వై.జంక్షన్‌ వద్ద గతంలో బ్యాటరీ కారు ద్వారా వృద్ధులు, వికలాంగులను పశ్చిమ రాజగోపురం వద్దకు తీసుకువచ్చి దర్శనానంతరం తిరిగి ఆ జంక్షన్‌ వద్దకు తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం ఈ కార్లు మూల పడడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2023 జనవరిలో 13 సీటింగ్‌ గల రెండు బ్యాటరీ కార్లను ఎస్‌బీఐ విరాళంగా అందజేసింది. ఒకటి అప్పుడే పాడైపోగా, రెండోది పది రోజులకే మూలన చేరింది. వాటిని అప్పటి ఈఓ చంద్రశేఖర్‌ ఆజాద్‌ బాగుచేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ అవి తరచుగా మరమ్మతులకు గురవుతూ చివరికి గ్యారేజీకి చేరాయి. కాగా 2025లో దాతలు మరో బ్యాటరీ కారు ఇచ్చారు. దాని పరిస్థితి సైతం అలాగే ఉంది.

శ్రావణానికై నా బాగయ్యేనా?

ఈ నెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న దరిమిలా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ నాటికై నా మరమ్మతులకు గురైన బ్యాటరీ కార్లు బాగయ్యేనా అని భక్తులు ప్రశ్నిసున్నారు.

ఈ మార్గాల్లో ఉపయుక్తం

రత్నగిరి, సత్యగిరి జంక్షన్‌, సీఆర్వో కార్యాలయం, వై జంక్షన్‌ నుంచి పశ్చిమ రాజగోపురానికి, అలాగే పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన పథకం వరకు, రామాలయం ముందు ఆలయ ప్రాంగణం నుంచి న్యూ సీసీ, ఓల్డ్‌ సీసీ సత్రాల వరకు వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ కార్లు నడిపితే ఆ సత్రాల్లో బస చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement