చదువుకొనలేం
● ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయని సర్కారు
● జిల్లాలో రూ.84 కోట్ల మేర బకాయిలు
● విద్యార్థులపై కళాశాలల ఒత్తిళ్లు
● ఫీజులు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతిస్తామంటూ బెదిరింపులు
● ప్రభుత్వ మొండి వైఖరిపై
విద్యార్థుల ఆగ్రహం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచాయి.. కళాశాలల విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.. ఈ పరిస్థితుల్లో చదువుపై ఫోకస్ చేయాల్సిన వారికి.. ప్రభుత్వం మళ్లీ టెన్షన్ తెచ్చి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. దీంతో, తమకు రావాల్సిన ఫీజుల కోసం విద్యార్థుల పీకల మీద ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్ల కత్తులు పెడుతున్నాయి. ఫీజు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ బెదిరిస్తున్నాయి. అటు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం.. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పట్టు బిగిస్తూండటంతో విద్యార్థులు అడకత్తెరలో పోకచెక్కల మాదిరిగా నలిగిపోతున్నారు.
సర్కారు వారి బకాయిలు ఇలా..
జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, జీఎన్‌ఎం, పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, డెంటల్, ఎంబీఏ తదితర కళాశాలలు 86 వరకూ ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న దాదాపు 19,500 మంది బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తూంటుంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.21.95 కోట్లు జమ చేసింది. మిగిలిన మూడు విడతలకు కలిపి మొత్తం రూ.40 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. పైగా దీంతో పాటు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ రూ.44 కోట్ల మేర కూడా బకాయి పెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో అర్హులైన మన రాష్ట్ర విద్యార్థులకు సైతం ఫీజు బకాయిలు చెల్లించేది. అటువంటిది ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న మన విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ తదితర సామాజిక వర్గాల వారికి కనీసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం సైతం ఇంతవరకూ ఇవ్వలేదు. గత వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.500 కోట్లకు పైగా జమ చేశారు. అటువంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమకు బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల అసోషియేషన్లు గత వారం లేఖ రాసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఫీజు రీయింబర్స్‌మెంటును పెంచిన జగన్
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్–1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉండేది. అప్పట్లో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు జరిగేది. మిగిలిన మొత్తాన్ని వారి తల్లిదండ్రులే భరించాల్సి వచ్చేది. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని గణనీయంగా పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం లభించింది.


