నిర్లక్ష్యపు ‘నీడ’లో..
● ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా
రత్నగిరిపై సూర్య గడియారం
● 80 సంవత్సరాల క్రితం నిర్మాణం
● నీడ ఆధారంగా కచ్చితమైన
సమయం తెలుసుకునే వీలు
● అరిగిపోయి అస్పష్టంగా మారిన
సమయ పట్టిక
● భక్తుల్లో అయోమయం
అన్నవరం: సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై ఏర్పాటు చేసిన పలభా యంత్రం (సూర్య గడియారం) నిర్లక్ష్యపు నీడలో వెలవెలబోతోంది. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గడియారం ద్వారా సూర్యుని నీడ ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. సత్యదేవుని ఆలయానికి ఈశాన్య భాగాన, స్వామివారి నిత్య కల్యాణ మండపం వద్ద ఈ సన్ డయల్ ఉంది.
ఇలా ఏర్పాటైంది
సూర్యుడి గమనం ఆధారంగా సమయం తెలుసుకునేలా ఈ సూర్య గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తిశాస్త్రి రూపొందించారు. 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలక మీద త్రికోణాకారంలో తూర్పు దిక్కుకు అభిముఖంగా మరో చిన్న పలకను నిలువుగా అమర్చారు. సూర్యకాంతి పడి దీని నీడ పెద్ద పలక మీద పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో మాదిరిగా అంకెలుంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలను అనుసరించి కొంత సమయం కలపడం లేదా తీసివేయడం చేయాలి. తద్వారా కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఉదాహరణకు జనవరి 25 మధ్యాహ్నం సూర్య గడియారంపై నీడ 12.25 గంటల మీద పడిందని అనుకుంటే అక్కడి సూచనల ప్రకారం ఆ తేదీకి 10 నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం మధ్యాహ్నం 12.35 గంటలు అయినట్టు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టీ) కూడా కచ్చితంగా అదే సమయాన్ని చూపిస్తుంది. అంత కచ్చితంగా దీనిని రూపొందించారు. ఎప్పుడు ఎంత సమయం కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే విషయాలను అక్కడి సూచనల పట్టికలో తెలిపారు.
ప్రాభవం కోల్పోతూ..
సత్యదేవుని దర్శనం పూర్తయ్యాక భక్తులు చూసేందుకు రత్నగిరిపై ఉన్న ఏకై క ఆకర్షణ ఈ సూర్య గడియారం. ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్య గడియారం ఆలనా పాలనా చూసేవారే కరువయ్యారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడి పలకపై వేసిన అంకెలు, సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో, ఇది ఓ పట్టాన అర్థం కాక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే, గతంలో ఇక్కడ ‘సూర్య గడియారం’ అని రాసి ఉన్న పెద్ద ఫ్లెక్సీ ఉండేది. ప్రస్తుతం చిన్న బోర్డు మాత్రమే మిగిలింది. అక్కడ శాశ్వతంగా రథంపై సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సూర్య గడియారానికి మరింత ఆకర్షణ చేకూరుతుంది. అలాగే, సన్ డయల్ గోడలకు రంగులు కూడా వేయించాలి. దీంతోపాటు అక్కడ సమయం ఎలా తెలుసుకోవాలో తెలిపే వివరాలతో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయాలి.
నిర్లక్ష్యపు ‘నీడ’లో..


