భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
గోకవరం: తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ ఉదయబాబు నాయుడు ఆధ్వర్యాన స్వామి వారిని పల్లకిలో ఉంచి, తూర్పు మెట్ల మీదుగా కిందకు గ్రామంలోకి తీసుకువచ్చి, వెంకటగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో స్వామి వారి నిజ పాదముద్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి విశేష పూజలు, శ్రీలక్ష్మీ నారసింహ సహిత మహా సుదర్శన హోమం, అభిషేకాలు నిర్వహించారు.
భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై
నేడు సమీక్ష
అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రకాష్ సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్‌డీఓ శ్రీరమణి అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో పాటు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం చేపట్టిన చర్యలు, ప్రభుత్వ శాఖల తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై ఈఓ వి.త్రినాథరావు వివరిస్తారు.
రాష్ట్ర క్రైస్తవ మహాసభలు
ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా ఆధ్వర్యాన కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు జరగనున్న ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ మహాసభలను చర్చ్ ఆఫ్ గాడ్ స్టేట్ ఓవర్సీస్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాసభలకు వచ్చి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలి రోజు యువతీ యువకులకు ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ గాడ్ యువజన అధ్యక్షుడు అంకిత్‌రెడ్డి ఆధ్వర్యాన స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. దైవ సేవకులు యువతకు ప్రత్యేక వర్తమానం అందించారు. కార్యక్రమంలో శాంతిరెడ్డి, సిస్టర్ శ్రేష్ట కర్మోజీరెడ్డి, పాస్టర్ జేసన్, సిస్టర్ మౌనిక జేసన్, రాష్ట్రవ్యాప్తంగా పలువురు చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం
రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గమని తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లూరులో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ, కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లను మార్చారని, పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారని అన్నారు. లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్ ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ


