అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని ఇనుమడింపజేసేలా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఎంతగానో అలరించాయి. కాకినాడ సాలిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ‘భరతమాత కన్న బిడ్డలం’ అంటూ సాగిన గీతానికి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తుని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ‘మా తుఝే సలాం’ దేశభక్తి గీతానికి నృత్య రూపకం ప్రదర్శించారు. ‘వందనం ఓ భారతావని, జయహో భారత్, వియ్ ఆర్ ఇండియన్స్’ అంటూ ఉమా మనోవికాస కేంద్రానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు చేసిన నృత్యం ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది. పెద్దాపురం నవోదయ విద్యాలయ విద్యార్థులు ‘భరతమాతా అందుకో వందనం, మన ఇండియా’ గీతాలకు, కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ దేశభక్తి గీతానికి చేసిన నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో ఉత్తమంగా కాకినాడ సాలిపేట మున్సిపల్ హైస్కూల్ మొదటి, ఉమా మనోవికాస కేంద్రం ద్వితీయ, కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతులు అందుకున్నారు.
వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన
ఈ వేడుకల్లో జిల్లా వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యాన ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, ఏపీఎంఐపీ, మెప్మా, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమం, మత్స్య, పోలీసు శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రథమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వితీయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్టాల్స్ తృతీయ బహుమతులు అందుకున్నాయి.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


