రద్దీగా సత్యదేవుని సన్నిధి
అన్నవరం: మాఘ మాసంలో తొలి ఆదివారం, రథసప్తమి పర్వదినం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో వచ్చారు. దీంతో, దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ ఆ వాహనాలతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు.
లోవలో భక్తుల సందడి
తుని: తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 3 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.92,640, పూజా టికెట్లకు రూ.76,750, కేశఖండన టికెట్లు రూ.7,160, వాహన పూజ టికెట్లు రూ.7,320, కాటేజీలు రూ.16,800, విరాళాలు, ఇతరత్రా రూ.25,397 కలిపి మొత్తం రూ.2,26,067 ఆదాయం సమకూరిందని వివరించారు.
4 నుంచి
కోకెనడా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకెనడా కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యాన ఫిబ్రవరి 4 నుంచి 14వ తేదీ వరకూ కోకెనడా హాకీ గోల్డ్‌కప్ పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ)లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారులు ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. 11 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 15 మహిళల, 10 పురుషుల జట్లు పాల్గొంటున్నాయని ఆయనకు నిర్వాహకులు వివరించారు. అపూర్వ భరత్ మాట్లాడుతూ, కేంద్ర సర్వీసుల్లో సేవలందిస్తున్న క్రీడాకారులు కాకినాడలో జరిగే టోర్నీలో పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్‌కుమార్, క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రద్దీగా సత్యదేవుని సన్నిధి


