కల్యాణ వైభోగమే.. ఇలలో..
● ప్రారంభమైన లక్ష్మీనారసింహుని ఉత్సవాలు
● వధూవరులుగా ముస్తాబైన స్వామి, అమ్మవారు
● సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగింపు
అంతర్వేది రథాన్ని మెరక వీధికి తరలిస్తున్న భక్తులు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని జన్మదినం రథ సప్తమిని పురస్కరించుకుని అమ్మ, స్వామివార్లను వధూవరులుగా అలంకరించారు. శ్రీవారిని పెళ్లికుమారునిగా, అమ్మవారిని పెళ్లికుమార్తెగా చేసే ముద్రికాలంకరణ కార్యక్రమాన్ని కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు తదితరులు వైఖానస ఆగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం శ్రీవారికి, అమ్మవారికి విశేష పూజలు చేశారు. మామిడాకుల భస్మంతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి ఈ తంతును రమణీయంగా పూర్తిచేశారు.
కొపనాతి విగ్రహానికి పూలమాలలు
కల్యాణోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, పల్లిపా లెం అగ్నికుల క్షత్రియులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, ప్రముఖులు రథం వద్ద కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసి, రథాన్ని ఆలయం వద్ద నుంచి గోవింద నామస్మరణల నడుమ మెరక వీధికి తీసుకువెళ్లారు. ఉత్సవాల తొలి రోజు సాయంత్రం 4.30 గంటలకు సూర్య వాహనంపై, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామి వారు మాడవీధుల్లో ఊరేగారు.
అంతర్వేదిలో నేడు..
అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ వారం హంస, శేష వాహనాలపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ధ్వజారోహణ చేస్తారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5.30 నుంచి 7 గంటల వరకూ శ్రీస్వామివారి తిరువారాధన, ఆర్జిత అభిషేకం, బాలభోగం, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ నారసింహ సుదర్శన హోమం నిర్వహించనున్నారు.


