పది రోజుల్లో పార్టీ కమిటీల నియామకం
● కూటమి పాలనలో సర్వత్రా అరాచకం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
తుని: వైఎస్సార్ సీపీ కమిటీల్లో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, పార్టీ కమిటీల జిల్లా టాస్‌ఫోర్స్ ఇన్‌చార్జి బొడ్డేడ ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు విప్పర్తి వేణుగోపాలరావు (జెడ్పీ చైర్మన్), వాసిరెడ్డి జమీల్, కొప్పన శివ, ఒమ్మి రఘురామ్‌లతో ఆదివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల నియామకాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు 18 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, దోచుకో దాచుకో అనే రీతిలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉత్సాహంతో పని చేయడానికి సిద్ధమయ్యాయని రాజా అన్నారు. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, పార్టీ కమిటీల నియామకాన్ని జిల్లాలో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని సామాజిక వర్గాలకూ కమిటీల్లో ప్రాధాన్యం ఉండేలా చూడాలన్నారు. కూటమి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను కమిటీలు తీసుకోవాలన్నారు. బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల తరఫున పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రానున్న రోజుల్లో రాజీ లేని పోరాటం చేయడానికి శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీల నియామకం పూర్తి చేసి, పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అప్‌లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.


