తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
● స్వామి దర్శనానికి సుమారు 25 వేల మంది
● రూ.3.47 లక్షల ఆదాయం
పెద్దాపురం (సామర్లకోట): మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం తొలి శనివారం పురస్కరించుకొని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఈఓ వడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయంలో భజనలు, కోలసంబరం నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అనేక మంది కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 25వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.14,710, అన్నదాన విరాళాలు రూ.1,02,847, కేశ ఖండన రాబడి రూ.5,680 తులాభారం ద్వారా రూ.500, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.23,910 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,500 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు


