ఆర్భాటంగా వచ్చి.. అందినంతా దోచి..
జగ్గంపేట: ఆర్భాటంగా వస్తాడు.. అందినకాడకు దోచేస్తున్నాడు.. చూడ్డానికి ఆఫీసర్‌లా జేబులో పెన్ను పెట్టుకుని, అతని కదలికలలో ఎలాంటి అనుమానం రాకుండా కన్నుమూసి తెరిచే లోపే మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్నాడు. జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మోటారు సైకిళ్ల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. సుమారు 10 వరకూ మోటారు సైకిళ్లు చోరీకి గురైనట్లు సమాచారం. వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. ఇందులో పైన చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. అతనే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నా, ఇప్పటి వరకూ చిక్కలేదు. దీంతో జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ గురువారం మోటారు సైకిళ్ల చోరీ నిందితుడి ఫొటోను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిసిన వారు తక్షణం 94407 96529 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న అతని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
మోటారు సైకిళ్ల చోరీ నిందితుడి చిత్రం విడుదల


