సిట్ నివేదికతో చంద్రబాబు కుట్ర బట్టబయలు
కాకినాడ రూరల్: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే తప్పుడు ఆరోపణతో ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన మహా కుట్రను.. సీబీఐ సిట్ బట్టబయలు చేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు నిరాధారమనే విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిందన్నారు. దీంతో, చంద్రబాబు కుటిల రాజకీయ ఎత్తుగడ మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నాటి నుంచి నేటి వరకూ టీడీపీ అనుకూల మీడియా సహా స్వామీజీలు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ అసత్య ఆరోపణలు చేసి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను కడిగిన పవన్.. ఆనాడు ఫొటో షూట్ చేశారని దుయ్యబట్టారు. కిర్రాక్ ఆర్‌పీ వంటి పెయిడ్ ఆర్టిస్టులతో లడ్డూ ప్రసాదంపై లేనిపోని రాద్ధాంతం సృష్టించడంపై మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అప్పట్లోనే వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. దీంతో, చంద్రబాబుకు సుప్రీంకోర్టు నాడు మొట్టికాయలు వేసిందన్నారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన తుది చార్జిషీట్ ప్రకారం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుయాయులు చేసిన ప్రచారం అసత్యమని తేలిందన్నారు. వైఎస్ జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలపై చేసిన అసత్య ప్రచారాలు, కుట్రలు నేటితో తొలగిపోయాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను కూడా వదలని చంద్రబాబులో ఇకనైనా మార్పు రావాలని, చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా ప్రజలను క్షమాపణ అడగాలని నాగమణి డిమాండ్ చేశారు. అసలు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నేతిలో కల్తీ వ్యవహారానికి తెర తీసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆరోపించారు. 2019 ఫిబ్రవరి 18న 94 వేల కేజీల నెయ్యిని రూ.291కే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో హర్ష డైరీగా ఉన్న ఆ సంస్థే ప్రస్తుతం భోలే బాబా డైరీ అన్నారు. సదరు డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని 2022లోనే జగన్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిందని నాగమణి పేర్కొన్నారు.


