తాళ్లరేవుకు ప్రసిద్ధి
తాళ్లరేవు: భారీ తాళ్ల తయారీకి తాళ్లరేవు ప్రసిద్ధి చెందింది. మునుపెన్నడూ లేని విధంగా 60 మంది కార్మికులు వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసిన తాడు అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవంలో వినియోగించనున్నారు. తొలుత కొబ్బరి పీచుతో చిన్నపాటి తాళ్లను తయారు చేసి వాటిని నాలుగు తాళ్లుగా పేనారు. అనంతరం ఆ నాలుగింటినీ కలుపుతూ ప్రత్యేక యంత్రం ద్వారా అత్యంత చాకచక్యంగా 30 అంగుళాల చుట్టుకొలత, 400 అడుగుల పొడవు కలిగిన భారీ తాడును రూపొందించారు. సుమారు రూ.7 లక్షలతో తయారు చేసిన దీని బరువు సుమారు 2 టన్నులు పైనే. రోజుకు 60 మంది కార్మికులు వారం రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, గోవింద నామస్మరణతో ఈ తాడును తయారు చేసినట్లు తాళ్ల వ్యాపారి సామా సూర్యప్రకాష్ తెలిపారు. కదిరి దేవస్థానానికి తాడు తయారు చేయడం ఇది నాలుగో సారి అని అన్నారు. మార్చి 10న జరిగే స్వామివారి రథోత్సవంలో ఈ తాడును వినియోగిస్తారని తెలిపారు. అదేవిధంగా మంగళగిరి, ద్రాక్షారామ, పుట్టకొండ, ముంగండ తదితర గ్రామాల్లోని ఆలయాలకు తాళ్లు తయారు చేసి ఇస్తుంటామని వివరించారు. తమ పూర్వీకుల నుంచి రథం తాళ్లను తయారు చేస్తున్నట్లు రథం తాళ్ల తయారీలో నిష్ణాతుడైన మందపల్లి గోవిందు తెలిపారు. సూర్యప్రకాష్ నేతృత్వంలో ఎనిమిది మేస్త్రిల పర్యవేక్షణలో అనేక మంది కార్మికులతో ఈ తాడును తయారు చేశామని చెప్పారు. పూర్తయిన తాడును ప్రత్యేక వాహనంలో ఉంచి కదిరి దేవస్థానానికి తరలించారు.
ఫ ఆకట్టుకున్న భారీ కొబ్బరి తాడు
ఫ 30 అంగుళాల మందం,
400 అడుగుల పొడవు
ఫ వారం రోజులు శ్రమించి తయారీ
తాళ్లరేవుకు ప్రసిద్ధి


