స్వామీ ఈ తేరుగ దయ చూసితివా! | - | Sakshi
Sakshi News home page

స్వామీ ఈ తేరుగ దయ చూసితివా!

Jan 30 2026 4:57 AM | Updated on Jan 30 2026 4:57 AM

స్వామీ ఈ తేరుగ దయ చూసితివా!

స్వామీ ఈ తేరుగ దయ చూసితివా!

సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: దేవదేవుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణం అనంతరం తన సోదరి గుర్రాలక్కకు చీరా, సారె పెట్టేందుకు స్వామివారు సతీ సమేతంగా రథంపై తోడ్కొని వెళ్లడం అనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన మాఢవీధుల్లో నిర్వహించిన రథయాత్ర అపూర్వ ఘట్టంగా నిలిచింది. మధ్యాహ్న సమయంలో సంప్రదాయ బద్ధంగా సాగిన ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు వెల్లువలా తరలి రావడంతో పూరీ జగన్నాథుని రథయాత్రను తలపించింది. అంతకుముందు గురువారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణం ముగియడంతో వేలాది మంది భక్తులు సముద్ర తీరంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తజన సంద్రంలో సాగిన తేరు

అంతర్వేది లక్ష్మీ నరసింస్వామివారి రథోత్సవం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మధ్యాహ్నం 2–05 గంటలకు ప్రారంభమయింది. మంగళ వాయిద్యాలతో, అర్చకుల వేదమంత్రాలతో నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకీలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. భక్తవరదుడు అంతర్వేది నరసింహస్వామివారు, అమ్మవార్లు రథంపై కొలువుదీరగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, వేలాది మంది భక్తులు రథాన్ని లాగారు. భక్తులు రథానికి అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మెరకవీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధి మీదుగా పదహారు కాళ్ల మండపం వద్దకు చేరుకుంది. మార్గ మధ్యంలో గుర్రాలక్కకు స్వామి తరఫున చీరె, సారె ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు అందజేశారు.

పరవళ్లు తొక్కిన ఆధ్యాత్మికత

ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తుల గోవింద నామస్మరణలు, నరసింహస్వామికి జై అనే నినాదాల మధ్య ఈ రథయాత్ర నయన మనోహరంగా సాగింది. రథయాత్రను చూసేందుకు... రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్వేది వీథులు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి కనువిందు చేసిన స్వామివారి కల్యాణం, గురువారం మధ్యాహ్నం గ్రామ వీథులను వైకుంఠ పథాలుగా మార్చిన రథోత్సవం, ఆ రెండు పర్వాలకు నడుమ భీష్మ ఏకాదశి వేకువ జామున సాగర స్నానం, అనంతరం ఆలయంలో స్వామి దర్శనం. ఇన్ని ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ఒకవైపు వశిష్ట తీరంలో నదీ పరవళ్లు.. తీరంలో ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలతో సమానంగా అంతర్వేది క్షేత్రంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆలయ చైర్మన్‌, ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్‌, ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ కొబ్బరి కాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. డీఆర్వో కొత్తా మాధవి, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, ఎండోమెంట్స్‌ డీసీ రమేష్‌ బాబు, జిల్లా ఎండోమెంట్స్‌ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ఎం.కె.వి.టి.ఎన్‌.వి. ప్రసాద్‌, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్‌ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు.

దర్శనానికి బారులు తీరిన భక్తులు

భీష్మ ఏకాదశి పర్వదినాన సాగర స్నానం చేసేందుకు వచ్చిన భక్తులతో తీరం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత భక్తులు ఆలయం వద్ద క్యూలో బారులుతీరి స్వామి వారిని దర్శించుకున్నారు. తీరంలో తలనీలాలు సమర్పించారు. సముద్ర స్నానాల చేసే ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అంతర్వేది తీర్థం కొనసాగుతోంది.

అంతర్వేదిలో నేడు

ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు శుక్రవారం ఉదయం మూడు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ, శ్రీస్వామివారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు. సాయంత్రం నాలుగు గంటలకు గజ వాహనంపై, రాత్రి ఎనిమిది గంటలకు పొన్న వాహనంపై శ్రీస్వామి గ్రామోత్సవం అర్చకులు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటలకు వరకు శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధి చేసేందుకు దర్శనాలను నిలిపివేయనున్నారు. భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిధి నాడు విరమణ చేసే అర్చకులు స్వామికి అన్న దర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహానివేదన చేస్తారు. రాత్రి ఏడు గంటలకు అన్న పర్వత మహానివేదన అనంతరం స్వామివారి దర్శనాలు మొదలవుతాయి.

నేత్రపర్వంగా

లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభం

పోటెత్తిన భక్త జనం

సోదరి గుర్రాలక్కకు చీర, సారె సమర్పణ

తెల్లవారుజామున సముద్ర స్నానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement