దేశంలో రూరల్ వార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో కాకినాడ రూరల్ నాయకత్వ పంచాయితీ చివరి దశకు చేరుకుంది. టీడీపీలో జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ లేని ఆధిపత్య పోరు ఈ ఒక్క నియోజకవర్గంలోనే చాన్నాళ్లుగా కొనసాగుతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో తెలుగు తమ్ముళ్లు ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్న’ వాతావరణం నెలకొంది. రెండున్నరేళ్లకు పైగా ఇక్కడి వర్గపోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నియమకానికి ఆ పార్టీ నేతలు చేసిన అనేక ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చివరకు స్వయంగా జోక్యం చేసుకున్నప్పటికీ అధినేత చంద్రబాబు సైతం చేతులెత్తేయక తప్పింది కాదు. అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి తమ్ముళ్లలో వర్గపోరు తగ్గకపోగా ఇటీవల మరింత పెరిగి, తాజాగా రోడ్డున పడింది.
చక్రం తిప్పినచోటే అవమానాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉండగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల ఆధిపత్యం ఉండేది. నాడు టీడీపీ జిల్లా రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పిన బొడ్డు భాస్కర రామారావు ఆశీస్సులతో పార్టీలో ఈ దంపతులకు తిరుగుండేది కాదు. కొంత కాలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తిబాబు కొనసాగారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన ఎగరేసుకుపోయింది. రూరల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నేత పంతం నానాజీ గెలుపులో అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. పొత్తు ధర్మంలో భాగంగా ఎంత కలసిమెలసి పోదామనుకుంటున్నా అన్నింటా అవమానాలే ఎదురవుతున్నాయని అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు పార్టీ ముఖ్య నేతల వద్ద మొర పెట్టుకుంటూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన వారికి వీసమెత్తు పని చేయలేని నిస్సహాయతలో ఉన్నామని వీరు చాలా కాలంగా ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో జనసేన ఆధిపత్యంతో ఇక్కడ టీడీపీ దాదాపు ఉనికే కోల్పోయింది.
తారస్థాయికి ఆధిపత్య పోరు
పార్టీలో చాలా కాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సత్తిబాబు వర్గం కొన్ని రోజులుగా మళ్లీ క్రియాశీలకంగా ఉంటోంది. ఈ ఆకస్మిక మార్పునకు కారణమేమిటనే అంశంపై జిల్లా టీడీపీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ ముఖ్య అనుచరుడిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ టీడీపీ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. తెర వెనుక నుంచి ఆయన అందిస్తున్న తోడ్పాటుతోనే అనంతలక్ష్మి దంపతులు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవి కోసం గళం వినిపిస్తున్నారని అంటున్నారు. వారికి సానా వర్గం బాహాటంగానే మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో సానా సతీష్‌పై టీడీపీ రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ గుర్రుగా ఉన్నారు. ఇదే అంశంపై సామర్లకోట మండలం కొప్పవరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీకి, బాబీకి మధ్య గత వారం సంవాదం చోటు చేసుకుందనే విషయం పార్టీలో గుప్పుమంది. పార్టీ కోసం రూరల్‌లో ఎప్పటి నుంచో పని చేస్తున్న సొంత సామాజిక వర్గానికి చెందిన తనను కాదని.. వైరి వర్గమైన సత్తిబాబు దంపతులకు మద్దతివ్వడంలో ఔచిత్యమేమిటంటూ కటకంశెట్టి ప్రశ్నించారని సమాచారం. కో కన్వీనర్‌గా ఉన్నప్పటికీ ఇన్‌చార్జిగా ఆయనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై జరిగిన చర్చ సందర్భంగా.. ‘చినబాబు’ తరఫున అక్కడ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతినిధి చిన్నబుచ్చుకునేలా మాట్లాడారంటూ బాబీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, టీడీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది.
రెండేళ్లకు పైగా ఇన్‌చార్జి పోస్టు ఖాళీ
చేతులెత్తేసిన చంద్రబాబు
తాజాగా తెర పైకి మాజీ
ఎమ్మెల్యే పిల్లి దంపతులు
చక్రం తిప్పుతున్న ఎంపీ ‘సానా’
కో కన్వీనర్ కటకంశెట్టికి చుక్కెదురే
కర్చీఫ్ వేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల
నేడు లోకేష్ సమక్షంలో బలప్రదర్శనకు
సిద్ధమవుతున్న వైరి వర్గాలు
రంగంలోకి పేరాబత్తుల
ఇప్పటికే రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం చాలదా అన్నట్టు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం తాజాగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరు కూడా తెర పైకి వచ్చింది. గతంలో ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లో ఐ.పోలవరం జెడ్పీటీసీగా పని చేసేవారు. అటువంటి ఆయనకు అధిష్టానం ఎమ్మెల్సీగా సముచిత స్థానమే కల్పించినప్పటికీ.. రూరల్ ఇన్‌చార్జి పదవి కోసం కర్చీఫ్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నియోజకవర్గ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనది కాని నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంలో తలదూర్చి, వ్యవహారాన్ని మరింత జటిలం చేయడం ఎంతవరకూ సబబని నిలదీస్తున్నారు. ఇటువంటి తరుణంలో శుక్రవారం కాకినాడ వస్తున్న మంత్రి లోకేష్ ఎదుట రూరల్‌లో ఆధిపత్యం కోసం వైరి వర్గాలన్నీ పోటాపోటీగా బలప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. కాకినాడ అచ్చంపేట జంక్షన్, సర్పవరం, ఏడీబీ రోడ్డు, కాకినాడ నగరంలో ఎవరికి వారే విస్తృతంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్ష సమావేశంలో రూరల్ ఇన్‌చార్జి నియామకం విషయాన్ని లోకేష్ ఏ తీరానికి చేరుస్తారో వేచి చూడాల్సిందే.


