సాహిత్యంలో వేటూరికి సాటి లేరు
● సినీ రచయిత, జాతీయ అవార్డు
గ్రహీత కాసర్ల శ్యామ్
● తునిలో వైభవంగా సుందర రామ్మూర్తి జయంతి వేడుకలు
● శ్యామ్‌కు వేటూరి పురస్కారం
తుని: సహజత్వానికి నిలువెత్తు నిదర్శనం సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి అని, ఆయనకు మరెవ్వరూ సాటి లేరని సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ కొనియాడారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన.. తునిలో జాతీయ రహదారి వద్ద ఉన్న చిట్టూరి మెట్రోలో వేటూరి సుందరరామ్మూర్తి 91వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్ర ఘోష, మేళతాళాల నడుమ కాసర్ల శ్యామ్‌కు వేటూరి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ, కలలు చెదిరినా, కలత చెందినా, ఎలాంటి భావాన్ని పలికించాలన్నా ఆ శక్తి, యుక్తి వేటూరికే సొంతమని అన్నారు. క్లిష్టమైన, సరళమైన పదాలతో ఆడుకోవడం ఆయనకు సర్వసాధారణమని, తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం ఆయన ప్రజల గుండెల్లో కొలువై ఉంటారని అన్నారు. వేటూరి సాహిత్యం సహజత్వానికి దగ్గర ఉంటుందని, ఇది మరెవరికీ సాధ్యం కాలేదని చెప్పారు. వేటూరితో పరిచయం లేకపోయినా ఆయన పాటల నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. అటువంటి మహోన్నత కవి పేరిట పురస్కారం అందుకోవడం జీవితంలో మరువలేనని ఆనంద బాష్పాలతో అన్నారు. నేడు యువ గాయకులకు, గేయ రచయితలకు చాలా అవకాశాలున్నాయన్నారు. సరస్వతీదేవిని కొలిస్తే వచ్చే జ్ఞానం మనల్ని కాపాడటమే కాదని, భూమిని రక్షిస్తుందని చెప్పారు. 2023లో సినీ పరిశ్రమకు వచ్చిన తనకు మహాత్మా సినిమాలోని ‘నీలపురి గాజుల’ పాటతో గుర్తింపు వచ్చిందన్నారు. తన పాటలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడకపోవడం, వేటూరిని కలవలేకపోవడం తన జీవితంలో తీరని లోటని చెప్పారు. ఎక్కడో పుట్టిన కవికి తునిలో వేడుకలు జరుపుతున్నారంటే సాహిత్యానికి తుని ప్రజలు ఎంతటి గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని, ఈ స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని శ్యామ్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వర శర్మ మాట్లాడుతూ, వేటూరికి తుని, పాయకరావుపేట పట్టణాల్లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని సాహితీ పీఠం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకూ తెలుగు సినీ చరిత్రలో నిష్ణాతులైన 14 మంది రచయితలకు వేటూరి అవార్డు అందజేశామని, 15వసారి కాసర్ల శ్యామ్‌కు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. వేటూరి పట్ల ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే విధంగా 150 పుస్తకాలను భారవికి అందజేశారు. తొలుత వేటూరి చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్, సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా తాతబాబు, సినీ మాటల రచయిత ఆకెళ్ల శివప్రసాద్, సినీ నటులు వడ్లమాని శ్రీనివాస్, ఐడీబీఐ జీఎం సూర్యకిరణ్‌శర్మ, తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.
సాహిత్యంలో వేటూరికి సాటి లేరు


