స్వీట్ హోమ్‌లో అగ్నిప్రమాదం
కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లి వంతెన సమీపంలో బొబ్బట్లు స్వీట్స్ దుకాణం ‘దుర్గా గణేష్ స్వీట్ హోమ్’ శాఖలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సుమారు రాత్రి 2 గంటల సమయంలో సంభవించిన ప్రమాదాన్ని ఆ సమీప రహదారిపై ప్రయాణించే వారు గమనించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే షాపులోని వస్తువులు, షోకేసులు, సిటింగ్ టేబుళ్లు, కుర్చీలు, ఎన్నో రకాల స్వీట్స్ అగ్నికి ఆహుతై దుకాణం పూర్తిగా దగ్ధమైంది. దుకాణ యజమానులు తెలిపిన వివరాల మేరకు ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దానితో మంటలు పక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.


