రత్నగిరిపై భక్తుల కిటకిట
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి బుధవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు లక్ష మంది వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు కిటకిటలాడాయి. రాత్రి 8–30 గంటల సమయానికి దేవస్థానానికి సుమారు పది వేల భక్తులు మంది వచ్చారు. చాలా మంది భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాక ఆలయ ప్రాంగణంలోని విశ్రాంతి మండపాలలో, షెడ్లలో విశ్రమించారు. కొంతమంది రామాలయం పక్కన గల విశ్రాంతి షెడ్డులో విశ్రమించారు.
తెల్లవారుజాము నుంచీ వ్రతాలు
కాగా గురువారం వేకువ జాము నుంచే సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి ఒంటి గంట నుంచి వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారి వ్రతం టిక్కెట్లు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే విక్రయించడం ప్రారంభించారు. దేవస్థానంలోని అన్ని చోట్ల షామియానాలు, భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయం, మహారాజ గోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు దేవస్థానంలో పర్యటిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
కాగా బుధవారం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అనంతరం భక్తులు గోశాలలో సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. సుమారు రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా
ముందుగానే భారీగా రాక
శోభాయమానంగా రత్నగిరి అలంకరణ
సత్రాలు ఖాళీ లేక
ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి
రత్నగిరిపై భక్తుల కిటకిట
రత్నగిరిపై భక్తుల కిటకిట


