నేటి నుంచి జి.మామిడాడలో..
పెదపూడి: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి స్వామివారి జయంతి, రథ సప్తమి వేడుకలు ఆదివారం నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లను ఆలయ ఉత్సవ కమిటీ, ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళశాసనాలతో ఆలయంలో ఆదివారం రథ సప్తమితో ప్రారంభమైయ్యే కల్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 2వ వరకూ జరుగుతాయి. 29న స్వామివారి కల్యాణం ఉంటుంది. సూర్య భగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో 10 మంది పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇందుకు గారు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభిస్తారు. సూర్యనారాయణ నామస్మరణతో రథాన్ని ఆలయ కమిటీ, గ్రామస్తులు ముందుకు లాగుతారు. రాత్రి తిరిగి రథోత్సవం ఆలయానికి చేరుకుంటుంది.


