కారు అద్దెకు తీసుకుని.. ఆపై అమ్మేసి దౌర్జన్యం
బాధితులను హింసించి, కిడ్నాప్‌కు యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: అవసరం నిమిత్తం కార్లు అద్దెకు తీసుకుని.. ఆనక అమ్మేసి సొమ్ము చేసుకుని.. అదేమని అడిగిన పాపానికి యజమాని బృందాన్ని చావబాది కిడ్నాప్‌కు యత్నించిన ఓ ఘరానా ముఠా చేసిన అకృత్యం తాజాగా చర్చనీయాంశమైంది. మండలంలోని తోకాడలో జరిగిన ఘటనకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఎత్తరి ఈశ్వర్ రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి.
హైదరాబాద్‌లోని ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న ఈశ్వర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అతని మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలతో కలిసి సొంతకార్లను అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో హరీష్ అనే వ్యక్తికి డిసెంబరు 3న సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునేలా తన మిత్రుడు జీవన్‌కు చెందిన మహీంద్ర థార్ కారును అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో హరీష్ కొంతకాలంగా అద్దె చెల్లించకపోగా ఆచూకీ తెలియకుండా పోయాడు. ఆ కారుకు అమర్చిన జీపీఎస్‌ను సైతం డిసెంబర్ 17 నుంచి తొలగించడంతో కారు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఈశ్వర్ బృందానికి ఎదురైంది. ఎట్టకేలకు జీపీఎస్ ఆచూకీ తెలియడంతో దానిని అనుసరించి వాహనం రాజానగరం మండలం, తోకాడలో ఉన్నట్టుగా గుర్తించారు. హరీష్ అనపర్తికి చెందిన వ్యక్తికి కారును విక్రయించినట్టు వారు తెలుసుకున్నారు. సోమవారం మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలు ఆ ప్రాంతానికి వెళ్లి తమ వద్ద ఉన్న మారు తాళంతో కారును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో కారును విక్రయించిన వ్యక్తి దానిని కొనుక్కున్న సబ్బెళ్ల మురళీకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అతడు మరికొందరితో ఈశ్వర్ బృందంపై దౌర్జన్యానికి పాల్పడి కిడ్నాప్‌కు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈశ్వర్ బృందంపై దాడి చేసిన వారు చాలామంది ఉండగా కేవలం ఆరుగురి పైనే కేసు నమోదు చేయడం, పోలీసులు సైతం ముక్తసరి సమాచారం ఇవ్వడంతో వారిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మాకు న్యాయం చేయండి
బతుకుదెరువు కోసం సొంత కార్లను అద్దెకు నడుపుతున్న తమపై ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని బాధితులు వాపోతున్నారు. కారును తమకు అప్పగించి, న్యాయం చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈశ్వర్ బృందం కోరుతోంది.
కారు అద్దెకు తీసుకుని.. ఆపై అమ్మేసి దౌర్జన్యం
కారు అద్దెకు తీసుకుని.. ఆపై అమ్మేసి దౌర్జన్యం


