వ్రత పురోహితులకు రెండు రోజుల్లో పారితోషికం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న సుమారు 250 మంది వ్రత పురోహితులకు డిసెంబర్ నెల పారితోషికం (జీతాలు) రెండు రోజుల్లో చెల్లించనున్నామని అన్నవరం దేవస్థానం అధికారులు మంగళవారం తెలిపారు. ప్రతి నెల పదో తేదీలోపు పారితోషికాన్ని వ్రత పురోహితుల అకౌంట్లకు జమ చేసేవారు. అయితే, ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపి, రూ.58.39 లక్షలు కాజేయడంతో దేవస్థానం వ్రత విభాగంలో తనిఖీలు చేపట్టారు. దీంతో, పారితోషికం బిల్లు ఈ నెల ఏడో తేదీన ఆడిట్‌కు పంపించినా అక్కడి నుంచి ఇంతవరకూ క్లియరెన్స్ రాలేదు. ఫలితంగా ఈ నెలలో 19వ తేదీ వచ్చేసినా వారికి పారితోషికం అందలేదు. దీనికి తోడు పాలకొల్లులో ఇటీవల నిర్వహించిన సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి వ్రత పురోహితులు బలవంతంగా కానుకలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్రతాలాచరించే భక్తుల నుంచి కానుకల స్వీకరణ విషయంలో కూడా అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో, ఆ ఆదాయానికి కూడా గండి పడింది. అటు పారితోషికం అందక, ఇటు కానుకలు స్వీకరించే అవకాశం లేకపోవడంతో వ్రత పురోహితుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. దీనిపై ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన ‘ఆకలి కేకలు’ కథనానికి దేవస్థానం వ్రత విభాగ అధికారులు స్పందించారు. ఆడిట్ విభాగం అధికారులతో మాట్లాడారు. దీంతో, వారు పారితోషికం బిల్లును పరిశీలించి, పంపించారు. ఆ బిల్లును ఈఓ వి.త్రినాథరావు బుధవారం పరిశీలించి, ఆమోద ముద్ర వేసి, చెక్కుపై సంతకం చేస్తారని అధికారులు తెలిపారు. ఆ చెక్కును స్టేట్ బ్యాంక్‌కు పంపిస్తామని, బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయానికి వ్రత పురోహితులకు పారితోషికం జమవుతుందని చెప్పారు.
దేవస్థానం అధికారుల వెల్లడి
వ్రత పురోహితులకు రెండు రోజుల్లో పారితోషికం


