పొత్తు వెనుక కత్తులు! | - | Sakshi
Sakshi News home page

పొత్తు వెనుక కత్తులు!

Mar 16 2026 7:51 AM | Updated on Mar 16 2026 7:51 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పైకి పొత్తులు.. వెనుక కత్తులు.. ‘తమ్ముళ్ల’కు అడుగడుగునా అవమానాలు.. చివరకు ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీగా చెప్పుకొనే అధినేత, సీఎం చంద్రబాబు ఇజ్జత్‌కే సవాల్‌ అంటున్న పరిస్థితి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇలాకా పిఠాపురంలో టీడీపీ దుస్థితి ఇది. అధికారమే పరమావధిగా కూటమి కట్టి.. పిఠాపురం సీటును కేటాయించినప్పటి నుంచి.. జనసేన పొత్తు ధర్మానికి అడుగడుగునా తూట్లు పొడుస్తోందని టీడీపీ రగిలిపోతోంది. ఏ రకంగా చూసినా నియోజకవర్గంలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడమే కాకుండా.. కనీసం విలువ కూడా లేకుండా చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న ఫొటోపై ఆగ్రహం

కమిషనర్‌ నామ కనకారావు అధ్యక్షతన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్‌ కల్యాణ మండపంలో రెండు రోజుల క్రితం నిర్వహించారు. పేరుకే అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు తప్ప అంతా జనసేన నేతల హవానే సాగింది. ఈ కార్యక్రమ వేదికపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బీజేపీ నాయకుడు గ్రంధి కొండలరావు, ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్‌ తదితరులు కూర్చున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమ వేదిక వెనుక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటో పెద్దదిగా, సీఎం చంద్రబాబు ఫొటో మాత్రం కనీ కనిపించనట్టుగా స్టాంప్‌ సైజ్‌లో వేశారు. చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేయడంపై ఆగ్రహించిన వర్మ వేదిక పైకి వెళ్లడానికి ససేమిరా అన్నారు. దీంతో, మున్సిపల్‌ అధికారులు కిందకు వచ్చి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కనీసం సీఎం చంద్రబాబును కూడా గౌరవించకపోతే ఎలాగని, ఆయన ఫొటో స్టాంప్‌లో వేసి అవమానిస్తారా అని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గద్దెనెక్కిన గత 20 నెలలుగా అనేక సందర్భాల్లో ఇటువంటి అవమానాలే ఎదురయ్యాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీటిని భరిస్తూనే వస్తున్నామని, ఇది పద్ధఽతి కాదని, పొత్తు ధర్మం, పార్టీ క్రమశిక్షణ కారణంగా మాట్లాడలేకపోతున్నామని కార్యక్రమాన్ని బహిష్కరించిన సందర్భంలో వర్మ పేర్కొనడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రమే మాట్లాడారు తప్ప వేదికపై ఉన్న జనసేన నేతలు కనీసంగా కూడా స్పందించలేదు. దీంతో, ఇదంతా కావాలని చేస్తున్న అవమానంగానే టీడీపీ శ్రేణులు పరిగణిస్తున్నాయి. సీఎంకు ఇంత అవమానం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారా అంటూ తనతో పాటు బయటకు వస్తున్న టీడీపీ కౌన్సిలర్లనుద్ధేశించి వర్మ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

గతంలోనూ..

● గత జనవరిలో మూడు రోజుల పాటు జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సైతం సీఎం చంద్రబాబు ఫొటో పెట్టలేదు. పార్టీల ఉమ్మడి అభిప్రాయాలను గౌరవించాలనే ఉద్ధేశంతో మాట్లాడలేకపోతున్నామని, అడుగడుగునా అవమానిస్తున్నా బయటకు చెప్పుకోలేకపోతున్నామంటూ నాడు వర్మ ఆ కార్యక్రమం నుంచి తిరుగుముఖం పట్టారు.

● గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ గెలుపే తన గెలుపు అనే రీతిలో వర్మ పని చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ఎమ్మెల్సీ వర్మకేనని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనకు ఎమ్మెల్సీ ఖాయమనుకుంటున్న తరుణంలో పవన్‌ వ్యూహాత్మకంగా ఆయనకు ఆ పదవి దక్కకుండా చేశారు. పవన్‌ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ, చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవి దక్కకపోగా అవమానమే ఎదురైందని వర్మ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మరో పవర్‌ పిల్లర్‌ ఉండకూడదనే పవన్‌ వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని వర్మ వర్గీయులు విశ్లేషిస్తున్నారు.

● గత ఏడాది జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు వర్మ పేరు నేరుగా ఎత్తకుండా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచీ జనసేన, టీడీపీ నాయకులు పరస్పరం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు.

● ఒకానొక సందర్భంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్‌ అన్ని విధాలా అర్హుడేనని మీడియా సమావేశం పెట్టి మరీ వర్మ ప్రకటించారు. తద్వారా పవన్‌పై తనకున్న వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. ఈ అంశం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

● జనసేన నేతల తీరు చూస్తూంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నట్టుగా ఉందని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

కావాలనే అవమానిస్తున్నారు

తరచూ కావాలనే అవమానిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో ఇలాగే చంద్రబాబు ఫొటో తీసేశారు. ఇలా ఇప్పటికి ఐదుసార్లు జరిగింది. ముఖ్యమంత్రి ఫొటోలు తీసేయడమంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇలాంటి విషయాల్లో ప్రశ్నించకపోతే నేను పార్టీలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే. ఇటువంటి అవమానకర పరిస్థితులు కల్పిస్తూ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు. కూటమి అంటే అందరూ కలసి ఉండాలి తప్ప ఇలా ఒకరినొకరు అవమానపరిచే విధంగా ఉండటం ఎంతవరకూ సమంజసం? ఇలాంటివి మళ్లీమళ్లీ జరుగుతుంటే మిగిలిన రెండు పార్టీలనూ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

– ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం

ఫ పవన్‌ ఇలాకాలో తమ్ముళ్లకు తాటాకులు

ఫ పిఠాపురంలో టీడీపీకి అవమానాలు

ఫ అసంతృప్తితో రగులుతున్న వర్మ

అధికారమున్నా.. ప్రతిపక్ష పాత్రకే..

తమ పార్టీ అధినేత చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కినా.. పిఠాపురంలో మాత్రం టీడీపీ ప్రతిపక్ష పాత్రనే పోషించాల్సి వస్తోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, ఇతర నేతలు అంతర్మధనం చెందుతున్నారు. ఇప్పటికే వర్మ మాటకు వీసమెత్తు విలువ కూడా లేకుండా చేస్తూండగా.. అధికారిక కార్యక్రమాల్లో సైతం జనసేన నేతలు సీఎం చంద్రబాబు బొమ్మ కూడా లేకుండా చేస్తున్నా చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement