అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిక్కిరిసిపోయింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,500 ఆచరించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు.


