పులి పాదయాత్ర ఎటువైపో..! | - | Sakshi
Sakshi News home page

పులి పాదయాత్ర ఎటువైపో..!

Mar 16 2026 7:51 AM | Updated on Mar 16 2026 7:51 AM

అన్నవరానికి మూడు కిలోమీటర్లు

దూరంలో సంచారం

అప్రమత్తంగా ఉండాలని

పోలీసుల హెచ్చరికలు

అన్నవరం: కొన్నాళ్ల క్రితం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం నియోజకవర్గం రాయవరంలో ప్రజలను హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు బోనులో చిక్కిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ పులి మెడకు ఎక్కడ సంచరిస్తుందో అనే సమాచారం తెలిపేందుకు ట్రాకర్‌ను అమర్చి అనంతదరం దానిని పాపికొండలు అభయారణ్యంలో వదిలేశారు. ఇప్పుడు ఆ పులి మరలా ఆ అరణ్యాన్ని దాటుకోని నాలుగు రోజులుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంచరిస్తూ ఆయా ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అది ఎప్పుడు ఏ దిక్కుకు వెళ్లుతుందో తెలియక ఆయా గ్రామాల ప్రజలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నిత్యం దాని ట్రాకర్‌ ద్వారా కదిలికలను గమనించి స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కొండకు మూడు కిలోమీటర్లు దూరంలో..

తాజాగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి పెద్ద పులి అన్నవరానికి మూడు కిలోమీటర్లు దూరంలో పంపా నది అవతల ఒడ్డున ఉన్నట్టు దాని ట్రాకర్‌ పంపించిన సమాచారంతో వెల్లడైంది. దీనితో అన్నవరం దేవస్థానంలోను, పంపా నదిని ఆనుకుని ఉన్న కొండలపై ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న ప్రజలు, మండపాం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. పంపా నది ఎండిపోయినందున ఆ బాట వేంటే ప్రయాణించి పులి ఒకవేళ అన్నవరం కొండ మీదకు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో దేవస్థానంలో అందరూ అప్రమత్తతతో ఉండాలని పోలీసులు మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

ఒంటరిగా సంచరించవద్దు

ఘాట్‌రోడ్‌లోనాలుగుచక్రాల వాహనాలలో ప్రయాణించేవారు ఎక్కడా ఆగవద్దని, ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు కూడా కనీసం ఇద్దరు కలిసి ప్రయాణించాలని తెలిపారు. దేవస్థానం సత్రాలలో, ప్రధానంగా సత్యగిరిపై హరిహరసదన్‌, శివసదన్‌, విష్ణుసదన్‌ హాల్స్‌లో బస చేసేవారు రాత్రివేళల్లో బయటకు రావద్దని సూచించారు. సత్యగిరి చివరన గల ఆగమపాఠశాల విద్యార్థులను ఆయా పాఠశాల వసతి గదుల్లోనే రాత్రంతా ఉండాలని బయటకు రావద్దని తెలిపారు. పంపా నది గర్భంలో మేతకు వెళ్లిన ఆవులను మధ్యాహ్నం ఒంటి గంటకే మరలా ఇళ్లకు తరలించేశారు. అన్నవరం, మండపాం సరిహద్దు ప్రాంతాలలోని వరి, మామిడి, జీడిమామిడి తోటలు కొబ్బరితోట రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement