బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లపై పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో శనివారం కూడా దాడులు ముమ్మరంగా చేశారు. జిల్లాలో ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వాటిని గుర్తించి 13 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. పదిమందిపై 6 (ఏ) కేసులు నమోదు చేశారు. ఇప్పటికి మొత్తంగా జిల్లాలో 45 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి, 22 6(ఏ) కేసులు నమోదు అయినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి రుద్రరాజు సత్యనారాయణరాజు విలేకరులకు తెలిపారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఇంట్లో ఉపయోగించే డొమిస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూశాఖ, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ముమ్మరంగా దాడులు చేస్తోందన్నారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదన్నారు.
రోడ్డు ప్రమాద బాధితుడికి
రూ.75 లక్షల భారీ పరిహారం
గొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు.
అత్యాచార నిందితుడిని
అరెస్ట్ చేయాలి
అమలాపురం టౌన్: మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి సంఘటనపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ ఆ గ్రామంలో పర్యటించి వాస్తవాలను రాబట్టింది. ఈ ఘటనలో నిందితుడైన ఎడ్ల సూరిబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని వేదిక డిమాండ్ చేసింది. నిందితుడు గతంలో కూడా ఇదే బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారాన్ని సేకరించింది. ఈ విషయాలను ఉమ్మడి జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ శనివారం ప్రకటనలో తెలిపారు. బాలిక తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, తనపై కేసు లేకుండా గ్రామ పెద్దల ఒత్తిడితో రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని కమిటీ బృందానికి గ్రామ ప్రజలు చెప్పారని ఇక్బాల్ పేర్కొన్నారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నాటకీయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
కోరింగ అభయారణ్యం
సందర్శన
తాళ్లరేవు: కేరళకు చెందిన వరల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల బృందం శనివారం కోరింగ అభయారణ్యాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కోరింగ ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఈటీ నిర్వహణ, మడ అడవుల భాగస్వామ్యంతో ఈడీసీల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి డాక్టర్ సనల్ సి.విశ్వనాథ్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని తమ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు గోపి నాగేంద్ర కుమార్, ధనుంజయ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరంలోని ఏపీ ఫారెస్ట్ అకాడమీకి చెందిన 41 మంది ట్రైనీలు అభయారణాన్ని సందర్శించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.మహేష్ కోరింగ అభయారణ్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఏవీ రమణమూర్తి, ఎఫ్‌బీఓ సీహెచ్ ధనలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.


