బస్సుడు కషా్టలు | - | Sakshi
Sakshi News home page

బస్సుడు కషా్టలు

Jan 19 2026 4:17 AM | Updated on Jan 19 2026 4:17 AM

బస్సు

బస్సుడు కషా్టలు

సంక్రాంతి తిరుగు ప్రయాణానికి అవస్థలు

వేలాదిగా ప్రయాణికులు

చాలీచాలని ఆర్టీసీ బస్సులు

రైళ్లు ముందుగానే ఫుల్‌

చార్జీలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్‌

గగ్గోలు పెడుతున్న జనం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): మూడు రోజుల ముచ్చటైన పండగ.. సంక్రాంతి ముగిసింది. పండగ సెలవులూ అయిపోయాయి. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో జీవనం సాగిస్తూ.. సంక్రాంతి పండగకు రెక్కలు కట్టుకుని వాలిపోయిన స్థానికులు.. ఇన్నాళ్లూ సొంతూళ్లలో.. అయినవారి మధ్య సందడి చేశారు. ఆ మధుర జ్ఞాపకాలను మది నిండా నింపుకొని.. పెట్టె, బ్యాగ్‌ సర్దుకుని ఆయా ప్రాంతాలకు బరువెక్కిన హృదయాలతో.. వీడలేమంటూ.. వీడుకోలంటూ.. తిరుగు ప్రయాణమవుతున్నారు. శనివారమే కొంతమంది బయలుదేరి వెళ్లగా మరికొందరు ఆదివారం ప్రయాణమయ్యారు. దీంతో, జిల్లాలోని ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. బస్సు రావడమే ఆలస్యం వాటిలో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. దీంతో, దాదాపు ఏ బస్సు చూసినా రద్దీగానే కనిపించింది.

అంతంత మాత్రంగా ఆర్టీసీ బస్సులు

రైళ్లలో రిజర్వేషన్లు ముందుగానే అయిపోయాయి. కాకినాడ, సామర్లకోట తదితర స్టేషన్ల నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే ప్రతి రైలులోనూ బెర్తులు చాన్నాళ్ల కిందటే నిండిపోయాయి. దీంతో, పండగ ప్రయాణికులు బస్సుల పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. వారి డిమాండును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్భాటంగా ప్రకటించినా.. అవి ఏమూలకూ చాలలేదు. కాకినాడ డిపో నుంచి హైదరాబాద్‌కు 7 ప్రత్యేక బస్సులు వేసినా వేలాదిగా వచ్చిన ప్రయాణికులకు అవి ఏమాత్రం సరిపోలేదు. పైగా ఆర్టీసీ స్పెషల్‌ బస్సులకు 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేశారని పలువురు ఆరోపించారు. అయినప్పటికీ, సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయం కల్పించడంతో అన్ని సీట్లూ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో, ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోలేని వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులు అందుబాటులో లేక ఆర్టీసీ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. ఊహించనంతగా ఏర్పడిన రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడపాలనుకున్నా.. అందుకు తగినన్ని బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో అనేక పల్లెవెలుగు బస్సులను దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులుగా కేటాయించడంతో.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా మరోవైపు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా తుని, రాజమహేంద్రవరం, అమలాపురం, జగ్గంపేట వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా బస్టాండ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో, మహిళలు, పిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు.

ప్రైవేటు బస్సు చార్జీలకు రెక్కలు

ఆర్టీసీ బస్సులు చాలినన్ని లేకపోవడంతో గత్యంతరం లేక అనేక మంది ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదనుగా ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడీకి తెర లేపారు. డిమాండ్‌ను బట్టి అసలు చార్జీకి రెండు మూడు రెట్లు అమాంతంగా టికెట్టు రేట్లు పెంచేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూర్‌, చైన్నె వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సు చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఆర్టీసీ బస్సులలో హైదరాబాద్‌ వెళ్లడానికి రూ.5 వేలలోపు సరిపోయేది. ఇదే ప్రయాణానికి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు సుమారు రూ.15 వేల వరకూ గుంజారని పలువురు ప్రయాణికులు వాపోయారు. హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు సాధారణ రోజుల్లో ప్రైవేట్‌ బస్సులకు ఏసీ సిట్టింగ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1,200.. స్లీపర్‌కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తారు. బస్సులను బట్టి ఆయా రేట్లు మారుతూంటాయి. అటువంటిది పండగ డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని రూ.2500 నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పైగా కూడా గుంజారు. గత్యంతరం లేక పలువురు ప్రయాణికులు అధిక రేట్లకు టికెట్లు కొనుక్కొని ప్రైవేటు బస్సులలోనే వెళ్లాల్సి వచ్చింది. ప్రైవేటు బస్సులలో కూడా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఉండటంతో ముందుగా బుక్‌ చేసుకున్న వారికి రూ.3 వేల వరకూ చార్జీ వసూలు చేశారు. అప్పటికప్పుడు వచ్చిన వారి నుంచి రూ.5 వేల వరకూ కూడా గుంజేశారు. ‘మీకు ఇష్టమైతేనే ప్రయాణించండి. డిమాండ్‌ ఉంది కాబట్టి రేట్లు ఇలానే ఉంటాయి’ అని పలు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు తెగేసి చెప్పేశారు. ఎక్కడైనా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మాత్రం సాధారణ రేటు తీసుకున్నారనే చెప్పాలని.. లేకుంటే దించేస్తామని ప్రయాణికులకు ముందుగానే హెచ్చరించారు.

ఆర్టీసీ టికెట్టు దొరకలేదు

బెంగళూరు వెళ్లేందుకు టికెట్టు కోసం వారం రోజులుగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆర్టీసీలో ఆన్‌లైన్‌లో టికెట్టు దొరకలేదు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో రూ.4 వేలు పెట్టి టిక్కెట్లు కొన్నాను. – పిడకా శేషు

ప్రభుత్వం పట్టించుకోలేదు

సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వచ్చాం. తిరిగి వెళ్లేందుకు రైలు టికెట్లు దొరకక ఆర్టీసీ బస్సు కోసం ప్రయత్నించా. సంక్రాంతి రద్దీకి తగినట్టుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. కుటుంబ సభ్యులతో తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో వెళ్లాల్సి వస్తోంది. మా కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున టికెట్టు కొన్నాం. మొత్తం రూ.16 వేలు వదిలిపోయాయి.

– అనుసూరి రాజకుమారి

బస్సుడు కషా్టలు1
1/3

బస్సుడు కషా్టలు

బస్సుడు కషా్టలు2
2/3

బస్సుడు కషా్టలు

బస్సుడు కషా్టలు3
3/3

బస్సుడు కషా్టలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement